
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. సోషల్ మీడియా వేదికగా చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబును గొర్రెతోలు కప్పుకున్న తోడేలుతో పోలుస్తూ, ప్రజాస్వామ్యం గురించి ఆయన మాట్లాడటాన్ని తప్పుబట్టారు. ఈ సందర్భంగా ‘రిగ్గింగ్ మాస్టర్ చంద్రబాబు’ అనే హ్యాష్‌ట్యాగ్‌తో పాటు ‘హే రామ్.. సేవ్ ఆంధ్రా!’ అంటూ ట్వీట్ చేశారు.
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శలు కొనసాగుతున్న సమయంలో జగన్ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారంటూ చంద్రబాబుపై పరోక్షంగా ఆరోపణలు చేశారు.
మరోవైపు మాజీ మంత్రి పేర్ని నాని కూడా చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోలీసులు, అధికారులను అడ్డుపెట్టుకుని, విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేసి టీడీపీ గెలిచిందని ఆరోపించారు. చంద్రబాబుది ప్రజాబలం కాదని, ఆత్మస్తుతి మాత్రమేనని విమర్శించారు.
వైసీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారని, కొన్ని చోట్ల నామినేషన్ పత్రాలు, బీ-ఫారాలను చించివేశారని పేర్ని నాని ఆరోపించారు. స్క్రూటినీ పేరుతో ఉద్దేశపూర్వకంగా నామినేషన్లను తిరస్కరించారని అన్నారు. వైసీపీ కార్యకర్తలపై పోలీసులు కేసులు, బైండోవర్లు నమోదు చేస్తూ, టీడీపీ శ్రేణులకు మాత్రం వెసులుబాటు కల్పించారని విమర్శించారు.
కడప కార్పొరేషన్‌తో పాటు పలు మున్సిపాలిటీలు, పులివెందులలో దొంగ ఓట్లు వేయించి టీడీపీ అభ్యర్థులు గెలిచారని పేర్ని నాని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియపై వైసీపీ నేతలు చేస్తున్న ఈ ఆరోపణలతో ఏపీ రాజకీయాల్లో మరోసారి అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం మొదలైంది.
