
తెలంగాణలో భవన నిర్మాణ అనుమతుల నిబంధనలను సమూలంగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ముఖ్యంగా చిన్న స్థలాల్లో ఇళ్లు నిర్మించుకునే వారికి అనుమతుల ప్రక్రియను మరింత సులభతరం చేయాలని భావిస్తోంది. ఇందులో భాగంగా ప్రస్తుతం ఉన్న సెట్‌బ్యాక్ నిబంధనలను 20 శాతం వరకు తగ్గించే ప్రతిపాదనను పరిశీలిస్తోంది.
అలాగే నిర్మాణ అనుమతుల మినహాయింపు పరిమితిని ప్రస్తుతం ఉన్న 75 గజాల నుంచి 100 గజాలకు పెంచే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది. దీంతో చిన్న స్థలాల్లో ఇళ్లు నిర్మించుకునే వారికి మరింత వెసులుబాటు కలగనుంది.
మరోవైపు 600 గజాల స్థలాల్లో సెల్లార్ నిర్మాణానికి అనుమతి ఇవ్వడం, కొన్ని రకాల భవనాలకు రెండు సెల్లార్లు నిర్మించుకునే అవకాశం కల్పించడం వంటి ప్రతిపాదనలు కూడా ఉన్నాయి.
ఇక చిన్న నిర్మాణ ప్రాజెక్టులకు మార్టిగేజ్ నిబంధనలను తొలగించే అంశంపైనా ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ మార్పులు అమల్లోకి వస్తే భవన నిర్మాణ అనుమతుల ప్రక్రియలో జాప్యం తగ్గడంతోపాటు, నిర్మాణదారులకు నిబంధనల పరంగా వెసులుబాటు లభించే అవకాశం ఉంది.
తెలంగాణలో భవన నిర్మాణ నిబంధనలను సమగ్రంగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. చిన్న స్థలాల్లో ఇళ్లు నిర్మించుకునే వారికి అనుమతుల ప్రక్రియను సులభతరం చేయడంతోపాటు బిల్డర్లకు కూడా వెసులుబాటు కల్పించేలా కొత్త నియమావళిని రూపొందిస్తోంది. ఇందుకోసం మున్సిపల్ శాఖ అధికారులు సంస్కరణల ముసాయిదా తయారీలో నిమగ్నమయ్యారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ హయాంలో 2012లో రూపొందించిన భవన నిర్మాణ నిబంధనలే ఇప్పటికీ ప్రధానంగా అమలవుతున్నాయి. మారుతున్న అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు మార్పులు చేసినప్పటికీ ఇప్పటివరకు మొత్తం 62 సార్లు సవరణలు చేపట్టారు.
ఇక 2016లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా నిర్మాణ రంగానికి ఊతమిచ్చేలా పలు కీలక మార్పులు తీసుకొచ్చింది. ముఖ్యంగా భవన నిర్మాణ అనుమతుల్లో జాప్యాన్ని తగ్గించడం, అనుమతుల గడువును పెంచడం వంటి చర్యలు చేపట్టింది.
అయితే ఇప్పటివరకు విడతలవారీగా చేసిన ఈ సవరణలన్నింటినీ సమీక్షించి, ప్రస్తుత పరిస్థితులు, నిర్మాణ రంగ అవసరాలకు అనుగుణంగా ఒకే సమగ్ర భవన నిర్మాణ నియమావళిని తీసుకురావాలని ప్రస్తుత ప్రభుత్వం యోచిస్తోంది.
తెలంగాణలో భవన నిర్మాణ నిబంధనల్లో మార్పులు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా సెట్‌బ్యాక్ నిబంధనలను మరింత సరళతరం చేయాలని భావిస్తోంది. ప్రస్తుతం రోడ్డు వెడల్పు, స్థలం విస్తీర్ణం, భవనం ఎత్తు ఆధారంగా సెట్‌బ్యాక్‌లను నిర్ణయిస్తున్నారు.
ఉదాహరణకు 100 నుంచి 200 చదరపు మీటర్ల స్థలంలో 10 మీటర్ల ఎత్తుతో భవనం నిర్మించాలంటే.. ఎదురుగా ఉన్న రోడ్డు వెడల్పు 36 అడుగులు ఉంటే 1.5 మీటర్లు, 54 నుంచి 72 అడుగుల మధ్య ఉంటే 3 మీటర్ల సెట్‌బ్యాక్ వదలాల్సి ఉంటుంది. ఈ నిబంధనలను వివిధ కేటగిరీలుగా విభజించి, ప్రస్తుతం అమల్లో ఉన్న సెట్‌బ్యాక్ దూరాలను గరిష్ఠంగా 20 శాతం వరకు తగ్గించే ప్రతిపాదనలను అధికారులు పరిశీలిస్తున్నారు.
ఈ మార్పులు అమల్లోకి వస్తే స్థలంలో నిర్మాణానికి ఉపయోగించుకునే విస్తీర్ణం పెరుగుతుంది. దీంతో సొంత ఇళ్లు నిర్మించుకునే వారికి అదనపు స్థలం అందుబాటులోకి రావడంతోపాటు బిల్డర్లకు కూడా నిర్మాణపరంగా ప్రయోజనం కలగనుంది.
75 గజాల నుంచి 100 గజాలకు అనుమతుల మినహాయింపు!
చిన్న స్థలాల యజమానులకు ఊరట కల్పించేలా మరో కీలక మార్పును ప్రభుత్వం పరిశీలిస్తోంది. ప్రస్తుతం 75 గజాల వరకు ఉన్న స్థలాల్లో ఇళ్ల నిర్మాణానికి అనుమతుల నుంచి మినహాయింపు ఉండగా.. ఈ పరిమితిని 100 గజాలకు పెంచాలని ప్రతిపాదిస్తోంది. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే చిన్న స్థలాల్లో ఇళ్లు నిర్మించుకునే వారికి అనుమతుల ప్రక్రియ మరింత సులభతరం కానుంది.
600 గజాల స్థలాల్లోనూ సెల్లార్ నిర్మాణానికి అవకాశం!
సెల్లార్ నిర్మాణానికి సంబంధించిన నిబంధనలను కూడా సవరించాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం కనీసం 900 గజాల స్థలంలో నిర్మించే భవనాలకే సెల్లార్ నిర్మాణానికి అనుమతి ఉంది. ఈ పరిమితిని 600 గజాలకు తగ్గించే ప్రతిపాదనను పరిశీలిస్తున్నారు.
ఈ మార్పు అమల్లోకి వస్తే మధ్యస్థాయి స్థలాల్లో భవనాలు నిర్మించే వారికి కూడా సెల్లార్ పార్కింగ్ సౌకర్యం కల్పించుకునే అవకాశం ఏర్పడుతుంది. తద్వారా వాహనాల పార్కింగ్ సమస్యను కొంతవరకు తగ్గించవచ్చని భావిస్తున్నారు.
నగరాల్లో రోజురోజుకూ పెరుగుతున్న పార్కింగ్ సమస్యను పరిష్కరించే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక మార్పులను పరిశీలిస్తోంది. ఇందులో భాగంగా భవనాల్లో సెల్లార్ల నిర్మాణానికి మరింత వెసులుబాటు కల్పించాలని అధికారులు భావిస్తున్నారు.
ప్రస్తుతం 750 నుంచి 1,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించే భవనాలకు ఒక సెల్లార్ నిర్మాణానికి మాత్రమే అనుమతి ఉంది. ఈ నిబంధనను సవరించి రెండు సెల్లార్లు నిర్మించుకునేందుకు అవకాశం కల్పించే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ మార్పు అమల్లోకి వస్తే అపార్ట్మెంట్లు, వాణిజ్య భవనాల్లో పార్కింగ్ స్థలం పెరగనుంది. తద్వారా రోడ్లపై వాహనాల పార్కింగ్ ఒత్తిడి తగ్గే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
చిన్న ప్రాజెక్టులకు మార్టిగేజ్ నిబంధనల తొలగింపు?
మరోవైపు బిల్డర్లకు ఇబ్బందిగా మారిన మార్టిగేజ్ నిబంధనలపైనా ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రస్తుతం భవన నిర్మాణ అనుమతులు పొందే సమయంలో నిర్దేశించిన కొంత భవన విస్తీర్ణాన్ని లేదా ఆస్తిలో కొంత భాగాన్ని మార్టిగేజ్ చేయాల్సి ఉంటుంది.
దీనివల్ల నిర్మాణం పూర్తయిన తర్వాత కూడా కొన్ని భవనాలను పూర్తిస్థాయిలో విక్రయించలేకపోతున్నామని బిల్డర్లు అభిప్రాయపడుతున్నారు. ఈ సమస్యను దృష్టిలో ఉంచుకుని పరిమిత విస్తీర్ణంలో నిర్మించే భవనాలకు మార్టిగేజ్ నిబంధనలను పూర్తిగా తొలగించే ప్రతిపాదనను అధికారులు పరిశీలిస్తున్నారు.
నిర్మాణ రంగానికి కొత్త ఊతం!
సెట్బ్యాక్లు, నిర్మాణ అనుమతులు, సెల్లార్లు, పార్కింగ్ సౌకర్యాలు, మార్టిగేజ్ నిబంధనల్లో మార్పులు తీసుకురావడం ద్వారా భవన నిర్మాణ రంగానికి మరింత ప్రోత్సాహం కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
అయితే ఈ మార్పులన్నీ ప్రస్తుతం ప్రతిపాదనల దశలోనే ఉన్నాయి. ప్రభుత్వం తుది భవన నిర్మాణ నియమావళిని ఖరారు చేసి అధికారిక ఉత్తర్వులు జారీ చేసిన తర్వాతే కొత్త నిబంధనల అమలుపై పూర్తి స్పష్టత రానుంది.
