
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారికి అత్యంత వైభవంగా పుష్పయాగ మహోత్సవం నిర్వహించారు. పవిత్ర కార్తీక మాసం, స్వామివారి జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని ఈ వేడుకను సంప్రదాయబద్ధంగా జరిపించారు. పుష్పయాగానికి అవసరమైన పూలను ముందుగా ఆలయానికి ఊరేగింపుగా తీసుకొచ్చారు. ఈ పుష్పాల ఊరేగింపు భక్తుల మధ్య అంగరంగ వైభవంగా సాగింది.
ఈ అపురూపమైన పుష్పయాగం కోసం ఏకంగా 9 టన్నుల (9 వేల కిలోల) పూలను వినియోగించారు. చామంతి, గులాబీ, మల్లె, కనకాంబరం, సంపంగి వంటి వివిధ రకాల పుష్పాలతో పాటు తులసి, మరువం, దవనం వంటి పవిత్రమైన పత్రాలను కూడా సమర్పించారు. రంగురంగుల పూలతో స్వామివారికి అభిషేకం నిర్వహించిన దృశ్యాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. భక్తి, ఆధ్యాత్మిక శోభతో తిరుమల ఆలయ పరిసరాలు పులకించిపోయాయి.
తిరుమల పుణ్యక్షేత్రం మరో అద్భుత ఆధ్యాత్మిక వేడుకకు వేదికైంది. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవేంకటేశ్వర స్వామివారికి అత్యంత వైభవంగా పుష్పయాగ మహోత్సవాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. పవిత్ర కార్తీక మాసం, స్వామివారి జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని ఈ వేడుకను సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా పుష్పయాగానికి అవసరమైన పూలను ఘనంగా ఊరేగింపుగా ఆలయానికి తీసుకొచ్చారు. తిరుమల కల్యాణ వేదిక సమీపంలోని ఉద్యానవన విభాగంలో పుష్పాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు శాస్త్రోక్తంగా పుష్పయాగం జరగనుంది.
16 రకాల పుష్పాలు.. 9 టన్నుల పూల వినియోగం
ఈ విశేష వేడుక కోసం సుమారు 9 టన్నుల (9 వేల కిలోల) వివిధ రకాల పుష్పాలు, సుగంధభరితమైన పత్రాలను సిద్ధం చేశారు. ఉదయం టీటీడీ ఉద్యానవన శాఖ కార్యాలయం నుంచి శ్రీవారి సేవకులు భక్తిశ్రద్ధలతో పూలను ఊరేగింపుగా మాడ వీధుల గుండా ఆలయంలోకి తీసుకెళ్లారు.
చామంతి, గులాబీ, మల్లె, కనకాంబరం, సంపంగి వంటి పుష్పాలతో పాటు తులసి, మరువం, దవనం వంటి పవిత్రమైన ఆకులను యాగంలో వినియోగించనున్నారు. వివిధ రంగుల పుష్పాలతో స్వామివారికి నిర్వహించే పుష్పాభిషేకం భక్తులకు కనువిందు చేయనుంది. ఈ వేడుకతో తిరుమల ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణం మరింత శోభాయమానంగా మారింది.
శ్రీవారికి ప్రతి ఏడాది దసరా నవరాత్రుల సందర్భంగా అత్యంత వైభవంగా సాలకట్ల బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ తొమ్మిది రోజుల ఉత్సవాలకు దేశవిదేశాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. ఈ క్రమంలో అర్చకులు, పరిచారకులు, అధికారులు, భక్తుల వల్ల తెలిసో తెలియకో ఏవైనా ఆగమ దోషాలు, అపచారాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తం చేయాలనే ఉద్దేశంతో పుష్పయాగాన్ని నిర్వహిస్తారు. ఆగమ శాస్త్రాల ప్రకారం బ్రహ్మోత్సవాలు ముగిసిన తర్వాత వచ్చే కార్తీక మాస శ్రవణ నక్షత్రం రోజున స్వామివారికి ఈ విశేష సేవను సమర్పించడం సంప్రదాయంగా కొనసాగుతోంది.
15వ శతాబ్దం నుంచి కొనసాగుతున్న సంప్రదాయం
తిరుమలలో పుష్పయాగం నిర్వహించే సంప్రదాయం 15వ శతాబ్దం నుంచే ఉన్నట్లు చారిత్రక ఆధారాలు సూచిస్తున్నాయి. అయితే మధ్యలో కొన్ని దశాబ్దాల పాటు ఈ వేడుక నిలిచిపోయింది. అనంతరం 1989లో టీటీడీ ఈ పుష్పయాగాన్ని తిరిగి శాస్త్రోక్తంగా ప్రారంభించింది. ఈ యాగం నిర్వహించడం వల్ల ప్రకృతి మాత శాంతించి, సకాలంలో వర్షాలు కురిసి, సమస్త లోకం సుభిక్షంగా ఉంటుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
ఈ వేడుకలో భాగంగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారిని సంపంగి ప్రాకారంలో ప్రత్యేకంగా కొలువుదీర్చుతారు. అనంతరం వేద మంత్రోచ్ఛారణల నడుమ సుమారు తొమ్మిది టన్నుల వివిధ రకాల పుష్పాలతో స్వామివారికి పుష్పాభిషేకం నిర్వహిస్తారు. స్వామివారి వక్షస్థలం వరకు రంగురంగుల పూలతో అభిషేకించడం ఈ యాగంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.
