D Spiritual: Nov 17: తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో కార్తిక మాస శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని నిర్వహించనున్న పుష్పయాగానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇందులో భాగంగా పుష్పయాగానికి అవసరమైన పుష్పాల ఊరేగింపు సోమవారం వైభవంగా నిర్వహించారు. తిరుమలలోని కల్యాణవేదిక వద్ద ఉన్న ఉద్యాన విభాగంలో పుష్పాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సీహెచ్. వెంకయ్య చౌదరి, శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో భాస్కర్, ఉద్యాన విభాగం డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు, సిబ్బంది, శ్రీవారి సేవకులతో కలిసి పుష్పాలను ఊరేగింపుగా ఆలయం వరకు తీసుకెళ్లారు.

ఈ సందర్భంగా టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర మాట్లాడుతూ.. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సమయంలో తెలియక జరిగిన దోషాల నివారణార్థం బ్రహ్మోత్సవాల అనంతరం కార్తిక మాసంలో స్వామివారి జన్మనక్షత్రమైన శ్రవణా నక్షత్రం రోజున పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని తెలిపారు. లోక కల్యాణార్థం 15వ శతాబ్దం నుంచే ఈ పుష్పయాగాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

మధ్యలో కొంతకాలం నిలిచిపోయిన ఈ మహోత్సవాన్ని టీటీడీ 1980 నుంచి తిరిగి పునరుద్ధరించి నిర్వహిస్తోందని ఈవో వివరించారు. పుష్పయాగంలో 16 రకాల పుష్పాలు, 6 రకాల పత్రాలను వినియోగించనున్నట్లు తెలిపారు.

ఈ ఏడాది పుష్పయాగం కోసం దాతలు మొత్తం 9 టన్నుల పుష్పాలను విరాళంగా అందించినట్లు ఈవో పేర్కొన్నారు. ఇందులో తమిళనాడు నుంచి 5 టన్నులు, కర్ణాటక నుంచి 2 టన్నులు, ఆంధ్రప్రదేశ్ నుంచి మరో 2 టన్నుల పుష్పాలు ఉన్నాయని వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *