ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులకు కేరళ ప్రభుత్వం, ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు కీలక విజ్ఞప్తి చేశాయి. పవిత్ర పంబా నదిలో పుణ్యస్నానం ఆచరించిన అనంతరం ధరించిన దుస్తులను నదిలోనే వదిలివేయవద్దని భక్తులకు సూచించాయి.

ఈ నిబంధనపై తెలుగు రాష్ట్రాల భక్తులకు అవగాహన కల్పించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు అధికారికంగా లేఖలు పంపించింది. ప్రతి అయ్యప్ప భక్తుడికి ఈ సందేశం చేరేలా విస్తృత ప్రచారం నిర్వహించాలని విజ్ఞప్తి చేసింది.

అంతేకాకుండా పంబా నదిలో స్నానం చేసిన తర్వాత దుస్తులను వదిలేయాలనే ఆచారం ఏ పురాణంలోనూ లేదని, అయ్యప్ప పూజా విధానాల్లోనూ అలాంటి నిబంధన లేదని దేవస్థానం బోర్డు స్పష్టం చేసింది. నదీ పవిత్రతను, పర్యావరణాన్ని కాపాడేందుకు భక్తులంతా సహకరించాలని కోరింది.

తెలుగు రాష్ట్రాల్లో అయ్యప్ప స్వామి భక్తుల సంఖ్య భారీగానే ఉంటుంది. ప్రతి ఏడాది వేలాది మంది భక్తులు అయ్యప్ప మాల ధరించి శబరిమల యాత్రకు వెళ్తుంటారు. ఈ ఏడాది కూడా మండల-మకరవిళక్కు సీజన్ నేపథ్యంలో భక్తులు శబరిమల యాత్రకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ భక్తులకు కేరళ ప్రభుత్వం, ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు కీలక విజ్ఞప్తి చేశాయి.

శబరిమల యాత్రలో భాగంగా పవిత్ర పంబా నదిలో పుణ్యస్నానం ఆచరించిన తర్వాత ధరించిన దుస్తులను నదిలోనే వదిలేయవద్దని సూచించాయి. ఈ విషయంపై తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి అయ్యప్ప భక్తుడికి అవగాహన కల్పించాలని కోరుతూ ఏపీ, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు దేవస్థానం బోర్డు అధికారికంగా లేఖలు పంపించింది.

అసలు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు?

ప్రస్తుతం మండల-మకరవిళక్కు సీజన్ ప్రారంభం కావడంతో శబరిమలకు భక్తుల రాక పెరుగుతోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి పెద్ద సంఖ్యలో అయ్యప్ప భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు వెళ్తుంటారు.

అయితే పంబా నదిలో పవిత్ర స్నానం చేసిన అనంతరం చాలామంది భక్తులు తాము ధరించిన దుస్తులను నదిలోనే వదిలేసి వెళ్తున్నారు. దీంతో నదిలో పెద్ద మొత్తంలో వస్త్ర వ్యర్థాలు పేరుకుపోతూ నీరు కలుషితమవుతోంది. ఈ పరిస్థితిని నివారించడంతో పాటు పంబా నది పవిత్రతను, పర్యావరణాన్ని కాపాడాలనే ఉద్దేశంతో దేవస్థానం బోర్డు ఈ విజ్ఞప్తి చేసింది.

భక్తులందరూ నదిలో దుస్తులు వదలకుండా, నిర్దేశించిన ప్రదేశాల్లోనే వాటిని పారవేయాలని అధికారులు కోరుతున్నారు.

పంబా నదిలో భక్తులు వదిలివెళ్లే దుస్తులు వందలాది ట్రక్కుల మేర పేరుకుపోతున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ వస్త్ర వ్యర్థాల కారణంగా నది నీరు కలుషితమవుతోందని, నీటిలో వైరస్‌లు, క్రిములు వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు నదిలో పేరుకుపోయిన దుస్తులను తొలగించడం పారిశుద్ధ్య సిబ్బందికి పెద్ద సవాలుగా మారింది. ఈ సమస్యకు పరిష్కారం చూపడంతో పాటు భక్తుల్లో అవగాహన పెంచేందుకు దేవస్థానం బోర్డు ప్రత్యేక చర్యలు చేపట్టింది.

పంబా నదిలో స్నానం చేసిన తర్వాత దుస్తులను నీటిలో వదిలేయాలని ఏ పురాణంలోనూ, అయ్యప్ప స్వామి పూజా విధానాల్లోనూ లేదని అధికారులు స్పష్టం చేశారు. కొందరు గురుస్వాములు చెప్పే మాటలను నమ్మి భక్తులు ఈ విధంగా చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. ఈ ఏడాది శబరిమల యాత్రను ‘క్లీన్ శబరిమల – పవిత్ర శబరిమల’ అనే నినాదంతో నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

పంబా నది పవిత్రతను, ప్రకృతి పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అధికారులు పేర్కొన్నారు. ఈ సందేశాన్ని తెలుగు రాష్ట్రాల్లోని అయ్యప్ప భక్తులకు చేరవేసేందుకు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు తమ ప్రచార మాధ్యమాల ద్వారా విస్తృతంగా అవగాహన కల్పించాలని కేరళ అధికారులు కోరారు.

అయ్యప్ప భక్తుల భద్రతకు ప్రత్యేక ఏర్పాట్లు

మరోవైపు శబరిమలకు వచ్చే లక్షలాది మంది భక్తులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన యాత్రానుభవం కల్పించేందుకు కేరళ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. యాత్రా సీజన్‌కు ముందుగానే సమీక్షా సమావేశాలు నిర్వహించి, మౌలిక సదుపాయాల అవసరాలను అంచనా వేసి కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేసింది.

ముఖ్యంగా శబరిమలకు వెళ్లే దాదాపు 400 కిలోమీటర్ల రహదారులను పరిధిలోకి తీసుకుంటూ ప్రభుత్వం ‘సేఫ్ జోన్’ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఈ మార్గాల్లో నిరంతర పోలీసు గస్తీ, అత్యవసర సహాయ సేవలను అందుబాటులో ఉంచి భక్తుల ప్రయాణ భద్రతను మెరుగుపరిచేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *