ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఖరగ్పూర్ ప్లాటినం జూబ్లీ వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ వేడుకల్లో ఐఐటీ ఖరగ్పూర్ 75 ఏళ్ల ప్రస్థానాన్ని గుర్తు చేస్తూ ప్రత్యేక స్మారక నాణేన్ని మోదీ ఆవిష్కరించారు.
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఖరగ్పూర్ (IIT Kharagpur) ప్లాటినం జూబ్లీ వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) పాల్గొన్నారు. ఈ వేడుకల్లో ఐఐటీ ఖరగ్పూర్ 75 ఏళ్ల ప్రస్థానాన్ని గుర్తు చేస్తూ ప్రత్యేక స్మారక నాణేన్ని మోదీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ప్రొఫెసర్లతో ఆయన ముచ్చటించారు. భారతదేశ అభివృద్ధికి ఐఐటీ ఖరగ్పూర్ అందించిన సహకారాన్ని వారికి వివరించారు. గడిచిన ఏడున్నర దశాబ్దాల్లో దేశం అనేక రంగాల్లో గణనీయమైన మార్పులను చూసిందని, ఈ ప్రయాణంలో ఐఐటీ ఖరగ్పూర్ కీలక పాత్ర పోషించిందని మోదీ పేర్కొన్నారు

ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. 1951లో ప్రారంభమైన ఐఐటీ ఖరగ్పూర్ దేశంలోనే తొలి ఐఐటీగా పేరుగాంచిందని అన్నారు. సాంకేతిక విద్య, పరిశోధన, ఆవిష్కరణలకు మార్గదర్శకంగా నిలిచిందని ప్రశంసించారు. తొలినాళ్లలో పారిశ్రామిక, మౌలిక సదుపాయాల అభివృద్ధికి అవసరమైన ఇంజనీర్లను అందించిందని.. ఆ తర్వాత అంతరిక్ష పరిశోధనలు, అణుశక్తి రంగాల్లోనూ దేశానికి సేవలందించిన ప్రతిభావంతులను తీర్చిదిద్దిందని కొనియాడారు. సమాచార సాంకేతిక రంగం విస్తరించిన తర్వాత సాఫ్ట్వేర్ పరిశ్రమ అభివృద్ధిలోనూ ఖరగ్పూర్ పూర్వ విద్యార్థులు కీలక పాత్ర పోషించారని ప్రశంసల జల్లు కురిపించారు. అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖ కంపెనీలకు నాయకత్వం వహించే వరకూ ఐఐటీ పూర్వ విద్యార్థులు ఎదిగారని కొనియాడారు.
మరోవైపు, ఐఐటీ ఖరగ్పూర్ ఉన్న ప్రదేశానికి స్వాతంత్య్ర పోరాటంతోనూ సంబంధం ఉందని ప్రధాని మోదీ గుర్తుచేశారు. బ్రిటిష్ పాలనలో ఈ ప్రాంతం స్వాతంత్య్ర సమరయోధులను నిర్బంధించిన శిబిరంగా ఉండేదని పేర్కొన్నారు. ఒకప్పుడు స్వాతంత్య్రం కోసం కలలు కన్న ఈ నేల.. ఇప్పుడు దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే వేదికగా మారిందన్నారు. ఈ సందర్భంగా పరిమితులను అధిగమించి, అవకాశాలను ఆవిష్కరించాలని విద్యార్థులకు ప్రధాని పిలుపునిచ్చారు. చాలామంది తమ కలలు, సామర్థ్యాలు, లక్ష్యాలకు హద్దులు విధించుకుంటారని.. ఇలాంటి పరిమిత ఆలోచనలను విడిచిపెట్టి కొత్త అవకాశాలను అన్వేషించాలని సూచించారు. ‘బ్రేక్ ద లిమిట్.. అన్లాక్ ద పాసిబిలిటీస్’ అంటూ మోదీ పేర్కొన్నారు.
