
అమరావతి: వైసీపీ ఎమ్మెల్సీ, పార్టీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి అరెస్టును వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ప్రశ్నిస్తూ పార్టీ అభ్యర్థులు, ప్రజలతో కలిసి శాంతియుతంగా నిరసన తెలిపితే తప్పుడు కేసులు నమోదు చేసి అరెస్టు చేయడం దుర్మార్గమని విమర్శించారు. రాష్ట్రంలో కొనసాగుతున్న పాలన ఎమర్జెన్సీ పరిస్థితులను తలపిస్తోందని ఆయన సోషల్ మీడియా వేదికగా ఆరోపించారు.
గుంటూరు రూరల్ మండలం వెంగళాయపాలెంలో గురువారం పరిషత్ ఎన్నికల పోలింగ్ ముగిసిన అనంతరం బ్యాలెట్ బాక్సులను నేరుగా నాగార్జున విశ్వవిద్యాలయానికి తరలించాల్సి ఉండగా, మధ్యలో నల్లపాడు వద్ద ఎందుకు దింపారని జగన్ ప్రశ్నించారు. ఎవరి ఆదేశాలతో బ్యాలెట్ బాక్సులను అక్కడికి తరలించారు? వాటికి కల్పించాల్సిన భద్రతా ఏర్పాట్లు ఏమయ్యాయని నిలదీశారు.
స్ట్రాంగ్ రూమ్‌కు చేరాల్సిన బ్యాలెట్ బాక్సులు రోడ్డుపై కనిపించడంతో వాటిని గుర్తించి శాంతియుతంగా నిరసన తెలిపిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలపై లాఠీఛార్జి చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తప్పులు చేసిన వారిపై చర్యలు తీసుకోవాల్సింది పోయి, నిరసన తెలిపిన తమ పార్టీ నాయకులపై అక్రమ కేసులు నమోదు చేయడం అన్యాయమని ఆరోపించారు.
ఒక ఎమ్మెల్సీపై డెకాయిటీ, దొంగతనం వంటి కేసులు నమోదు చేయడం దారుణమని జగన్ వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న అప్రజాస్వామిక విధానాలను దేశ ప్రజలు గమనిస్తున్నారని, ఇలాంటి చర్యలను ప్రజలు సహించరని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న వారికి ప్రజలే తగిన సమాధానం చెబుతారని జగన్ తన పోస్టులో పేర్కొన్నారు.
