
పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ కలపడం (E20) కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. పర్యావరణ పరిరక్షణ, ఇంధన దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించే లక్ష్యంతో ఈ విధానాన్ని అమలు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. అయితే, ఈ E20 విధానంలోనూ అక్రమాలు జరుగుతున్నాయంటూ కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు.
ఇది E20 విధానం కాదని, ప్రజలను మోసం చేసే ‘420’ విధానమంటూ కేంద్రంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా కర్ణాటక ప్రభుత్వం రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో పెట్రోల్ బంకుల నుంచి సేకరించిన ఇంధన నమూనాల పరీక్షా నివేదికను ఆయన ప్రస్తావించారు. ఈ నివేదికలో ఇథనాల్ మిశ్రమానికి సంబంధించి నిర్దేశిత 20 శాతం ప్రమాణంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నారు. కేంద్రం అమలు చేస్తున్న E20 విధానంపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) పేరుతో ఓట్ల చోరీ జరుగుతోందని ఆరోపిస్తూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా E20 పెట్రోల్ విధానాన్ని లక్ష్యంగా చేసుకుని మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రజల వాహనాల్లో వినియోగించే పెట్రోల్ నుంచే దొంగతనానికి పాల్పడుతోందని వ్యాఖ్యానించారు.
పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ మాత్రమే కలుపుతున్నట్లు కేంద్రం చెబుతున్నప్పటికీ, కాంగ్రెస్ పాలిత కర్ణాటకలోని ఏడు జిల్లాల్లో సేకరించిన పెట్రోల్ నమూనాల పరీక్షల్లో నిర్దేశిత పరిమాణం కంటే ఎక్కువ ఇథనాల్ ఉన్నట్లు వెల్లడైందని రాహుల్ పేర్కొన్నారు. ఈ నివేదికను ప్రస్తావిస్తూ కేంద్రం అమలు చేస్తున్న E20 విధానంపై అనుమానాలు వ్యక్తం చేశారు.
E20 కాదు.. 420: రాహుల్ గాంధీ విమర్శలు
ఈ వ్యవహారంపై ప్రముఖ సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’లో స్పందించిన రాహుల్ గాంధీ.. ‘‘E20 కాస్తా 420గా మారింది.. ప్రజల కార్ల నుంచి పెట్రోల్ దొంగిలిస్తున్నారు!’’ అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 420ను ఉద్దేశిస్తూ కేంద్ర ప్రభుత్వంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
ఇదే సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి గతంలో తాను విసిరిన బహిరంగ చర్చ సవాల్‌ను మరోసారి గుర్తుచేశారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో జరుగుతున్నట్లు ఆరోపిస్తున్న అక్రమాలతో పాటు E20 పెట్రోల్ అంశాన్ని కూడా చర్చలో చేర్చేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. దీంతో E20 విధానంపై రాజకీయంగా మరోసారి వాదోపవాదాలు మొదలయ్యాయి.
E20 అనేది పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్‌ను కలిపి తయారు చేసే ఇంధనం. సాధారణంగా ఇథనాల్‌ను చెరకు వంటి వ్యవసాయ ఉత్పత్తుల నుంచి తయారు చేస్తారు. భారత్ తన మొత్తం ముడి చమురు అవసరాల్లో 80 శాతానికి పైగా దిగుమతులపైనే ఆధారపడుతోంది. ఈ దిగుమతుల భారాన్ని తగ్గించడంతో పాటు ప్రత్యామ్నాయ ఇంధన వనరులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం జీవ ఇంధనాల (Biofuels) వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించింది.
ఈ క్రమంలో గత దశాబ్ద కాలంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇథనాల్ బ్లెండింగ్ కార్యక్రమాన్ని వేగవంతం చేసింది. 2013-14లో పెట్రోల్‌లో ఇథనాల్ మిశ్రమం కేవలం 1.5 శాతంగా ఉండగా, దశలవారీగా పెంచుతూ 2025-26 నాటికి 20 శాతం లక్ష్యాన్ని చేరుకుంది. ఈ విధానం ద్వారా ముడి చమురు దిగుమతులను తగ్గించడం, దేశీయంగా ఇథనాల్ ఉత్పత్తిని ప్రోత్సహించడం, పర్యావరణ కాలుష్యాన్ని నియంత్రించడం వంటి ప్రయోజనాలను సాధించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది.
