పిఠాపురం నియోజకవర్గంలో ప్రజా సేవా కార్యక్రమాలకు మరో ముందడుగు పడింది. అపోలో ఆస్పత్రుల వైస్ చైర్‌పర్సన్ ఉపాసన కొణిదెల పిఠాపురంలో పర్యటించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని అగ్రహారంలో అత్యాధునిక సదుపాయాలతో నూతనంగా అభివృద్ధి చేసిన మోడల్ అంగన్‌వాడీ కేంద్రాన్ని ఆమె లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉపాసన కొణిదెల.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పరిపాలనా విధానం, ప్రజల సంక్షేమం కోసం ఆయన చేస్తున్న కృషిపై ప్రశంసలు కురిపించారు.

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో ప్రజా సేవా కార్యక్రమాలకు మరో ముందడుగు పడింది. అపోలో ఆస్పత్రుల వైస్ చైర్‌పర్సన్ ఉపాసన కొణిదెల, కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీతో కలిసి పిఠాపురంలో పర్యటించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని అగ్రహారంలో అత్యాధునిక వసతులతో నూతనంగా అభివృద్ధి చేసిన మోడల్ అంగన్‌వాడీ కేంద్రాన్ని వారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంతో స్థానికంగా చిన్నారులు, మహిళలకు మెరుగైన సేవలు అందించే దిశగా మరో అడుగు పడింది.

రాష్ట్రవ్యాప్తంగా మహిళలు, చిన్నారుల ఆరోగ్యం, పౌష్టికాహారం, ప్రాథమిక విద్యా ప్రమాణాలను మెరుగుపరచడమే లక్ష్యంగా అపోలో ఫౌండేషన్ ‘అపోలో ఆరంభ్’ ప్రాజెక్టును ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 109 మోడల్ అంగన్‌వాడీ కేంద్రాలను ఆధునిక సదుపాయాలతో అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా కొణిదెల కుటుంబం సహకారంతో తొలి మోడల్ అంగన్‌వాడీ కేంద్రాన్ని పిఠాపురంలో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ కేంద్రం ద్వారా స్థానిక తల్లులు, చిన్నారులకు మెరుగైన ఆరోగ్య, పోషకాహార సేవలతో పాటు నాణ్యమైన ప్రాథమిక విద్య అందించేందుకు అవకాశం కలుగుతుందని నిర్వాహకులు తెలిపారు.

ఈ సందర్భంగా ఉపాసన కొణిదెల డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పరిపాలనా విధానం, పిఠాపురం అభివృద్ధి కోసం ఆయన చేస్తున్న కృషిని ప్రశంసించారు. ‘‘ప్రజలందరికీ పవన్ కల్యాణ్ అంటే పవర్ స్టార్‌గా తెలుసు. కానీ పిఠాపురంలో ఆయన చేపడుతున్న అభివృద్ధి పనులు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలను దగ్గరగా పరిశీలించిన తర్వాత నాకు ఆయన ఒక ‘ఎంపవర్ స్టార్’గా కనిపిస్తున్నారు’’ అని కొనియాడారు.

మహిళలు ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించేలా నైపుణ్యాభివృద్ధి శిక్షణ, సులభంగా రుణాలు అందించే అంశాలపై పవన్ కల్యాణ్ ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని ఉపాసన పేర్కొన్నారు. అదేవిధంగా కొత్త పాఠశాలలు, కళాశాలల ఏర్పాటుతో విద్యార్థులకు మెరుగైన విద్యావకాశాలు కల్పిస్తూ, వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్నారని ప్రశంసించారు. మహిళలు, యువత, విద్యార్థుల సాధికారత కోసం ఆయన చేస్తున్న ప్రయత్నాలు అభినందనీయమని ఉపాసన కొనియాడారు.

ఈ మోడల్ అంగన్‌వాడీ కేంద్రాల్లో కేవలం మౌలిక వసతుల కల్పనకే పరిమితం కాకుండా చిన్నారుల ఆటపాటలు, డిజిటల్ విద్యాబోధన, గర్భిణులకు పౌష్టికాహారంపై అవగాహన కల్పించడం వంటి కార్యక్రమాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వనున్నారు. చిన్నారుల సమగ్ర అభివృద్ధితో పాటు తల్లులు, గర్భిణుల ఆరోగ్య పరిరక్షణకు అవసరమైన సేవలను కూడా అందించనున్నారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోనూ మిగిలిన 108 మోడల్ అంగన్‌వాడీ కేంద్రాలను దశలవారీగా ఏర్పాటు చేసి అందుబాటులోకి తీసుకురావాలని అపోలో ఫౌండేషన్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *