
రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న వేళ కడప జిల్లాలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ప్రొద్దుటూరు మండలం తాళ్లమాపురం ఎంపీటీసీ స్థానంలో జనసేన అభ్యర్థికి ఓటమి ఎదురైంది. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన శిగినేని సుబ్బమ్మ 373 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు.
ఈ ఎన్నికల్లో సుబ్బమ్మ, జనసేన అభ్యర్థి వీరం మౌనిక మధ్య పోటీ నెలకొంది. ఓట్ల లెక్కింపు పూర్తయ్యాక సుబ్బమ్మ విజయం ఖరారైంది. దీంతో ఆమె మద్దతుదారులు గ్రామంలో ఆనందోత్సాహాలతో సంబరాలు చేసుకున్నారు.
తాళ్లమాపురం ఎంపీటీసీ పరిధిలో మొత్తం 3,709 ఓట్లు ఉండగా, 2,976 ఓట్లు పోలయ్యాయి. గతంలో ప్రొద్దుటూరులో జరిగిన సభలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తాళ్లమాపురం అభివృద్ధికి నిధులు మంజూరు చేసినట్లు ప్రకటించారు. అయినప్పటికీ ఇక్కడ జనసేన అభ్యర్థి ఓటమి చెందడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.
కూటమి అభ్యర్థుల మధ్య ఉన్నాయని చెబుతున్న అంతర్గత విభేదాలు ఈ ఫలితంపై ప్రభావం చూపి ఉండవచ్చని స్థానికంగా చర్చ జరుగుతోంది. ఏదేమైనా, 373 ఓట్ల మెజారిటీతో స్వతంత్ర అభ్యర్థి సాధించిన విజయం తాళ్లమాపురం ఎంపీటీసీ ఫలితాన్ని ప్రత్యేకంగా నిలిపింది.
