తెలంగాణలో కోటి మందికి పైగా కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రారంభిస్తోంది. ఈ పథకం ద్వారా ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా సదుపాయం కల్పించనున్నారు. కుటుంబంలో సంపాదించే వ్యక్తి పేరు మీద బీమా పాలసీ తీసుకుంటారు. ఒకవేళ బీమా పొందిన వ్యక్తి మరణిస్తే, ఆ కుటుంబ సభ్యులకు లేదా నామినీకి రూ.5 లక్షల పరిహారం అందజేస్తారు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. రేషన్ కార్డులు లేని కుటుంబాలు కూడా ఈ పథకానికి అర్హులేనని ప్రభుత్వం స్పష్టం చేసింది.

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నేడు (నవంబర్ 19) ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్దిపేటలో ఈ పథకాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు. సాయంత్రం 4.30 గంటలకు సిద్దిపేట పట్టణంలో నిర్వహించే ర్యాలీలో సీఎం పాల్గొంటారు. అనంతరం జరిగే బహిరంగ సభలో ఇందిరమ్మ ఫ్యామిలీ ఇన్సూరెన్స్ స్కీమ్‌కు శ్రీకారం చుడతారు.

రాష్ట్రంలోని కోటికి పైగా కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ పథకాన్ని రూపొందించింది. ఇందులో భాగంగా ప్రతి కుటుంబంలో సంపాదించే వ్యక్తి పేరిట రూ.5 లక్షల జీవిత బీమా సదుపాయం కల్పించనున్నారు. బీమా పొందిన వ్యక్తి మరణిస్తే, వారి నామినీకి లేదా కుటుంబ సభ్యులకు రూ.5 లక్షల పరిహారం అందజేస్తారు. ఒక కుటుంబంలో ఒకరి కంటే ఎక్కువ మంది సంపాదిస్తున్నట్లయితే.. ఎవరికి బీమా చేయించాలనేది కుటుంబ సభ్యులే నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. తద్వారా ఆపద సమయంలో పేద కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలవాలని ప్రభుత్వం భావిస్తోంది.

ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకానికి సంబంధించి ప్రభుత్వం ప్రజలకు మరో కీలక వెసులుబాటు కల్పించింది. ఈ పథకం కోసం లబ్ధిదారులు ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. బీమా ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే భరించనుంది. తెలంగాణకు చెందిన అన్ని కుటుంబాలు ఆదాయం, ఇతర అర్హతలతో సంబంధం లేకుండా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. రేషన్ కార్డులు లేని కుటుంబాలు కూడా అర్హులే. కుటుంబంలో 18 నుంచి 59 ఏళ్ల మధ్య వయసున్న సంపాదించే వ్యక్తి పేరు మీద బీమా కల్పిస్తారు. వయసు నిర్ధారణకు ఆధార్ కార్డులోని పుట్టిన తేదీని ప్రామాణికంగా తీసుకుంటారు.

2026 నవంబర్ 19న ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. డిసెంబర్ 18 వరకు నెల రోజుల పాటు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఇందుకోసం గ్రామ పంచాయతీ కార్యాలయాలు, పట్టణాల్లోని వార్డు కార్యాలయాల్లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేయనున్నారు. వీటితో పాటు మొబైల్ యాప్, ఆన్‌లైన్ విధానం, ఇంటింటి సర్వే ద్వారా కూడా కుటుంబాల వివరాలను నమోదు చేస్తారు.

మరోవైపు ఒక జిల్లాలో రేషన్ కార్డు ఉండి, వేరే జిల్లాలో నివాసం ఉంటున్న వారు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వారు ప్రస్తుతం నివసిస్తున్న ప్రాంతానికి సమీపంలోని ప్రత్యేక శిబిరాల్లోనే తమ పేర్లను నమోదు చేసుకునే అవకాశం కల్పించారు.

ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకానికి దరఖాస్తు చేసుకునే వారు కొన్ని ముఖ్యమైన వివరాలు, పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలి. బీమా చేయించుకునే వ్యక్తి ఆధార్ కార్డుతో పాటు కుటుంబ సభ్యులందరి ఆధార్ నంబర్లు తప్పనిసరిగా తీసుకెళ్లాలి. రేషన్ కార్డు ఉంటే దాని నంబర్, మొబైల్ ఫోన్ నంబర్ కూడా అందించాలి. అదేవిధంగా నామినీల వివరాలు, వారి ఆధార్ నంబర్లు, రూ.5 లక్షల బీమా పరిహారంలో ఎవరికి ఎంత వాటా ఇవ్వాలనే విషయాన్ని దరఖాస్తు సమయంలోనే స్పష్టంగా నమోదు చేయాలి.

మరో కీలక విషయం ఏమిటంటే.. ఇప్పటికే కార్మికులు, మత్స్యకారులు, గౌడలు, నేతన్నల కోసం అమల్లో ఉన్న బీమా పథకాలను కూడా ఇందిరమ్మ బీమా పరిధిలోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని 2026-27 తెలంగాణ బడ్జెట్‌లో తొలిసారిగా ప్రకటించారు. ఈ పథకం అమలు కోసం ప్రభుత్వం ఏకంగా రూ.4 వేల కోట్లు కేటాయించింది. తొలుత తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2 నుంచే పథకాన్ని ప్రారంభించాలని భావించారు. అయితే పథకానికి సంబంధించిన మార్గదర్శకాల రూపకల్పన, ఇతర పరిపాలనాపరమైన కారణాలతో అమలు వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా నవంబర్ 19న ప్రారంభించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *