
D Spiritual: Nov 12: అలిపిరి నడక మార్గాన్ని పరిశీలించిన టీటీడీ అదనపు ఈవో.. దుకాణదారులకు కీలక ఆదేశాలు!
తిరుమలకు అలిపిరి మార్గం ద్వారా కాలినడకన వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంపై టీటీడీ ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా టీటీడీ అదనపు ఈవో సీహెచ్. వెంకయ్య చౌదరి గురువారం అలిపిరి నుంచి తిరుమలకు వెళ్లే నడక మార్గాన్ని పరిశీలించారు. మాధవ నిలయం (పీఏసీ-2) నుంచి జీఎన్సీ టోల్గేట్ వరకు ఉన్న మార్గంలో పర్యటించి అక్కడి పరిస్థితులను సమీక్షించారు.
ఈ సందర్భంగా నడక మార్గంలో భక్తులకు అవసరమైన సమాచారాన్ని అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు. ముఖ్యంగా శ్రీవారి దర్శనానికి సంబంధించిన వివరాలు, ఉచిత వసతి సౌకర్యాల సమాచారం భక్తులకు సులభంగా అర్థమయ్యేలా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అలాగే ఈ మార్గంలో చేపట్టాల్సిన ఇతర అభివృద్ధి పనులపై అధికారులతో చర్చించారు.
దుకాణదారులకు కీలక సూచనలు
నడక మార్గంలోని దుకాణాలను అదనపు ఈవో తనిఖీ చేశారు. భక్తులకు విక్రయించే తాగునీరు, తినుబండారాలను నిర్దేశించిన ధరలకే విక్రయించాలని స్పష్టం చేశారు. దుకాణాల పరిసరాల్లో ఎలాంటి ఆక్రమణలకు తావు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ తనిఖీల్లో ఎస్ఈ-2 వేణుగోపాల్, డిప్యూటీ ఈవోలు వేంకటేశ్వర్లు, సోమన్నారాయణ, డీఈ చంద్రశేఖర్‌తో పాటు పలువురు టీటీడీ అధికారులు పాల్గొన్నారు.
