
సూపర్‌స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ కాంబోలో రాబోతున్న హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ ‘జైలర్ 2’ అక్టోబర్ 15న దసరా కానుకగా విడుదలవుతున్నట్లు సన్ పిక్చర్స్ అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమా రిలీజ్‌కు ఇంకా టైమ్ ఉన్నప్పటికీ, కేరళలో థియేట్రికల్ హక్కుల కోసం అప్పుడే తీవ్ర పోటీ మొదలైంది. మొదటి భాగం మలయాళంలో సంచలన వసూళ్లు సాధించడంతో పాటు, ఈ సీక్వెల్‌లో కూడా మలయాళ స్టార్ మోహన్‌లాల్ పాత్ర ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందనే టాక్ వినిపిస్తోంది.
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ తెరకెక్కించిన ‘జైలర్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టించిందో అందరికీ తెలిసిందే. తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, హిందీ బెల్ట్‌లలో కాసుల వర్షం కురిపించిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్, మలయాళ మార్కెట్‌లోనూ అనూహ్యమైన రికార్డులను నమోదు చేసింది. రజనీకాంత్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచిన ఈ బ్లాక్‌బస్టర్‌కు ఇప్పుడు సీక్వెల్‌గా ‘ జైలర్ 2 ‘ సిద్ధమవుతోంది. ఇటీవల మేకర్స్ విడుదల చేసిన రిలీజ్ డేట్ గ్లింప్స్ సోషల్ మీడియాను షేక్ చేయడంతో పాటు, సినిమాపై ఉన్న అంచనాలను ఒక్కసారిగా ఆకాశానికి తీసుకెళ్లింది.
జైలర్ 2′ వెండితెరపైకి రావడానికి ఇంకా సమయం ఉన్నప్పటికీ, ఈ సినిమా థియేట్రికల్ హక్కుల కోసం మలయాళ చిత్ర పరిశ్రమలో అప్పుడే భారీ పోటీ మొదలైనట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. ముఖ్యంగా కేరళలోని ప్రముఖ పంపిణీ సంస్థలు ఈ క్రేజీ సీక్వెల్ రైట్స్‌ను ఎలాగైనా దక్కించుకోవాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయట. మొదటి భాగం కేరళ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబట్టడం, దానికి తోడు మలయాళ స్టార్ నటుడు మోహన్‌లాల్ ‘మాథ్యూ’ అనే ప్రత్యేక పాత్రలో కనిపించి అక్కడి ప్రేక్షకులను థియేటర్లలో ఉర్రూతలూగించడమే ఈ రేంజ్ డిమాండ్‌కు ప్రధాన కారణమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

