
పులివెందులలో గతంలో ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవని అక్కడ గణనీయమైన మార్పు వచ్చిందని కమలాపురం ఎమ్మెల్యే కృష్ణ చైతన్య రెడ్డి అన్నారు. పులివెందులలో ఎలాంటి గొడవలు జరగడం లేదని అక్కడికి వెళ్లి అల్లర్లు సృష్టించే పరిస్థితి లేదని స్పష్టం చేశారు.
సాక్షి మీడియాను అడ్డుపెట్టుకుని వైసీపీ అధినేత జగన్ ప్రజలను తప్పుదోవ పట్టించేలా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పులివెందులలో మళ్లీ జగన్ మార్క్ రాజకీయాలు మొదలయ్యాయని కృష్ణ చైతన్య రెడ్డి విమర్శించారు.
తాను చేసిన తప్పులను ఇతరులపై నెట్టడం జగన్ రాజకీయ శైలిగా మారిందని మండిపడ్డారు. ఎన్నికల్లో ఓటమి భయంతోనే టీడీపీ నేతలు గొడవలు సృష్టిస్తున్నారంటూ వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు. పులివెందులలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగాలని తాము కోరుకుంటున్నామని తెలిపారు.
అవినాష్ రెడ్డి అసత్య ఆరోపణలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. బాబాయ్ హత్య కేసులో ఏం జరిగిందో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని వ్యాఖ్యానించారు. రాజకీయ ప్రయోజనాల కోసం అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించవద్దని ఎమ్మెల్యే కృష్ణ చైతన్య రెడ్డి సూచించారు.
