
ఆంధ్రప్రదేశ్లో కరువు మండలాల సంఖ్య మరింత పెరిగింది. ఖరీఫ్ సీజన్లో తాజాగా మరో 24 మండలాలను కరువు ప్రభావిత ప్రాంతాలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో గతంలో అక్టోబరు 1న ప్రకటించిన 388 మండలాలతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరువు మండలాల సంఖ్య 412కి చేరింది. కొత్తగా ప్రకటించిన 24 మండలాల్లో 12 తీవ్ర కరువు, 12 మధ్యస్థ కరువు మండలాలు ఉన్నాయి.
తాజాగా కరువు మండలాలుగా గుర్తించిన ప్రాంతాలు ఎనిమిది జిల్లాల్లో ఉన్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. కరువు ప్రభావిత ప్రాంతాల్లో తక్షణమే ఉపశమన చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. రైతులకు అవసరమైన సహాయం అందించడంతో పాటు, పరిస్థితులకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
తీవ్ర కరువు మండలాలు ఇవే..
కొత్తగా ప్రకటించిన తీవ్ర కరువు మండలాల జాబితాలో మార్కాపురం జిల్లాలోని రాచర్ల, శ్రీసత్యసాయి జిల్లాలోని రొళ్ల, అగళి, పెనుకొండ, అనంతపురం జిల్లాలోని రాయదుర్గం, పెద్దపప్పూరు ఉన్నాయి. అలాగే కర్నూలు జిల్లాలో ఆస్పరి, నందవరం, ఆదోని-2, కోసిగి, మంత్రాలయం, కల్లూరు మండలాలను తీవ్ర కరువు ప్రాంతాలుగా గుర్తించారు.
మధ్యస్థ కరువు మండలాల జాబితా..
కాకినాడ జిల్లాలో జగ్గంపేట, ఏలూరు జిల్లాలో ద్వారకా తిరుమల, పెదపాడు, చాట్రాయి, నూజివీడు, ముసునూరు, ఏలూరు గ్రామీణ, ఆగిరిపల్లి మండలాలను మధ్యస్థ కరువు ప్రాంతాలుగా ప్రకటించారు. కృష్ణా జిల్లాలో మచిలీపట్నం దక్షిణ, కడప జిల్లాలో ఒంటిమిట్ట, సిద్ధవటం, నందలూరు మండలాలు ఈ జాబితాలో ఉన్నాయి.
మొత్తంగా 295 తీవ్ర, 117 మధ్యస్థ కరువు మండలాలు
రాష్ట్ర ప్రభుత్వం అక్టోబరు 1న ముందస్తుగా 21 జిల్లాల్లో 388 కరువు మండలాలను ప్రకటించింది. అప్పట్లో 283 మండలాలను తీవ్ర కరువు ప్రాంతాలుగా, 105 మండలాలను మధ్యస్థ కరువు ప్రాంతాలుగా గుర్తించింది. తాజాగా మరో 24 మండలాలను చేర్చడంతో తీవ్ర కరువు మండలాల సంఖ్య 295కు, మధ్యస్థ కరువు మండలాల సంఖ్య 117కు చేరింది.
నైరుతి రుతుపవనాల సీజన్లో నమోదైన వర్షపాతం లోటు, పంటల సాగు విస్తీర్ణం తగ్గుదల తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం ఈ మండలాలను కరువు ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించింది. కరువు మండలాల్లోని రైతులకు రుణ సదుపాయం కల్పించడంతో పాటు, అవసరమైన ఉపశమన చర్యలు చేపట్టాలని సంబంధిత జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
