
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్దిపేట పర్యటన నేపథ్యంలో తెలంగాణ రాజకీయాల్లో మరోసారి చర్చ మొదలైంది. స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావును ఉద్దేశిస్తూ కల్వకుంట్ల కవిత ముఖ్యమంత్రికి లేఖ రాశారు. కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ నిర్మాణంలో అవినీతి జరిగిందని ఆరోపించిన ఆమె.. విజిలెన్స్ విచారణ నివేదికకు అనుగుణంగా బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మరోవైపు మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టుల భూనిర్వాసితుల సమస్యలను కూడా కవిత తన లేఖలో ప్రస్తావించారు. భూములు కోల్పోయిన బాధితులకు ఇప్పటివరకు అందని పరిహారాన్ని తక్షణమే చెల్లించాలని కోరారు. నిర్వాసితులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు సిద్దిపేటలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో సిద్దిపేట రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. నియోజకవర్గంలో రాజకీయంగా పట్టు సాధించడంపై కాంగ్రెస్ పార్టీ దృష్టి సారించగా, స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు కూడా ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రశ్నిస్తున్నారు.
మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం’ను సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట వేదికగా ప్రారంభించనున్నారు. ఇదే సమయంలో తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ముఖ్యమంత్రికి లేఖ రాయడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ నిర్మాణంలో అవినీతి జరిగిందని ఆరోపించిన ఆమె.. దీనిపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీఎం సిద్దిపేట పర్యటనకు ముందే కవిత ఈ అంశాన్ని తెరపైకి తీసుకురావడం చర్చనీయాంశంగా మారింది.
సిద్దిపేట జిల్లాలోని కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ నిర్మాణంలో అవినీతి, డిజైన్ మార్పులు, నాణ్యతా లోపాలు జరిగినట్లు తమ దృష్టికి వచ్చిందని కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. ముఖ్యంగా మల్లన్న సాగర్ నుంచి కొండపోచమ్మ సాగర్‌కు నీటిని తరలించే కాలువ డిజైన్‌లో మార్పులు, పంప్‌హౌస్ నిర్మాణంలో జరిగినట్లు ఆరోపిస్తున్న అక్రమాలపై సమగ్రంగా పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. ఈ అంశాలపై ఇప్పటికే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ చేపట్టిన విచారణ ఆధారంగా బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాసిన లేఖలో కవిత డిమాండ్ చేశారు.
మల్లన్న సాగర్ నుంచి కొండపోచమ్మ సాగర్‌కు నీటిని తరలించే కాలువ, టన్నెల్ డిజైన్లలో మార్పుల వెనుక అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు, ఆయనకు సన్నిహితంగా ఉన్న ఇంజినీర్ల పాత్ర ఉందని కల్వకుంట్ల కవిత ఆరోపించారు. ఈ వ్యవహారంలో భారీ అవినీతి జరిగినట్లు విజిలెన్స్ నివేదిక వెల్లడించిందని ఆమె పేర్కొన్నారు. డిజైన్ల మార్పులు, ఇతర అక్రమాల కారణంగా ప్రభుత్వ ఖజానాపై వందల కోట్ల రూపాయల అదనపు భారం పడిందని ఆరోపించారు.
అంతేకాకుండా, కాలువ నిర్మాణ పనులు నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా చేపట్టకపోవడంతో మర్కూక్ మండలం పరిధిలోని వెంకటాపురం గ్రామం నీట మునిగిందని కవిత పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో 28 మంది ఇంజినీర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని విజిలెన్స్ శాఖ సిఫార్సు చేసినట్లు వెల్లడించారు. అలాగే బాధ్యులైన నిర్మాణ సంస్థల నుంచి రూ.230 కోట్లకు పైగా నిధులను తిరిగి రాబట్టాలని కూడా విజిలెన్స్ సూచించినట్లు ఆమె తెలిపారు. ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కవిత డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్దిపేట పర్యటన నేపథ్యంలో కల్వకుంట్ల కవిత రాసిన లేఖ తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావును ఉద్దేశిస్తూ ఆమె నవంబర్ 14న లేఖ రాసినట్లు తేదీ ద్వారా తెలుస్తోంది. అయితే సీఎం సిద్దిపేట పర్యటన రోజే ఆ లేఖను ఎక్స్ వేదికగా బహిర్గతం చేశారు. కొండపోచమ్మ సాగర్ నిర్మాణంలో అవినీతి జరిగిందనడానికి ఆధారాలు ఉన్నాయని పేర్కొన్న కవిత.. వాటిపై చర్యలు తీసుకుంటారా మిస్టర్ సీఎం? అంటూ రేవంత్ రెడ్డిని ట్యాగ్ చేస్తూ లేఖను పోస్టు చేశారు.
మరోవైపు మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టుల భూనిర్వాసితులకు పరిహారం చెల్లింపుల అంశాన్ని కూడా కవిత ప్రస్తావించారు. ఈ మేరకు ముఖ్యమంత్రికి మరో లేఖ రాశారు. మల్లన్న సాగర్ కోసం 13,962 ఎకరాలు, కొండపోచమ్మ సాగర్ కోసం 4,636 ఎకరాల భూమిని సేకరించారని తెలిపారు. ఈ ప్రాజెక్టుల కారణంగా వేలాది మంది తమ ఇళ్లను కోల్పోయారని పేర్కొన్నారు.
అయితే 2013 భూసేకరణ చట్టం ప్రకారం నిర్వాసితులకు అందాల్సిన పరిహారం, పునరావాసం (R&R) ప్యాకేజీలు ఇప్పటికీ పూర్తిస్థాయిలో అందలేదని కవిత ఆరోపించారు. పరిహారం అందక భూనిర్వాసితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొంటూ, పెండింగ్‌లో ఉన్న పరిహారాన్ని వీలైనంత త్వరగా చెల్లించి బాధితులకు న్యాయం చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు.
