D Spiritual: Nov 11: శీతాకాలం నేపథ్యంలో కేదార్‌నాథ్ ఆలయం మూసివేత.. ఓంకారేశ్వర్ ఆలయానికి ఉత్సవ విగ్రహం తరలింపు!

ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రమైన కేదార్‌నాథ్ ఆలయాన్ని శీతాకాలం ప్రారంభం నేపథ్యంలో మూసివేశారు. బుధవారం ఉదయం 8.30 గంటలకు వేద మంత్రోచ్ఛారణల మధ్య ఆలయ ద్వారాలకు తాళాలు వేశారు. దీంతో ఈ ఏడాది కేదార్‌నాథ్ స్వామివారి దర్శనాలు ముగిశాయి.

ఆలయ మూసివేత సందర్భంగా తెల్లవారుజామున 4 గంటల నుంచే ప్రత్యేక పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. సంప్రదాయబద్ధంగా అన్ని పూజా కార్యక్రమాలను నిర్వహించిన అనంతరం శుభ ముహూర్తంలో ఆలయ ద్వారాలను మూసివేశారు. అనంతరం బాబా కేదార్ ఉత్సవ విగ్రహాన్ని వేలాది మంది భక్తుల సమక్షంలో ఉఖీమఠ్‌లోని ఓంకారేశ్వర్ ఆలయానికి తరలించారు. ఈ సందర్భంగా భక్తులు హర హర మహాదేవ్ నినాదాలతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నింపారు.

ఈ ఏడాది 19 లక్షల మంది భక్తుల దర్శనం

ఈ ఏడాది సుమారు 19 లక్షల మంది భక్తులు కేదారేశ్వరుడిని దర్శించుకున్నట్లు సమాచారం. శీతాకాలం నేపథ్యంలో ఆలయాన్ని మూసివేస్తున్న సందర్భంగా మంగళవారం సాయంత్రం కేదార్‌నాథ్‌లో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. సాయంత్రం హారతి ముగిసిన అనంతరం భారత సైన్యానికి చెందిన ఆర్మీ బ్యాండ్ ప్రత్యేక సంగీత ప్రదర్శన ఇచ్చింది. ఆలయ ప్రధాన పూజారి సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది.

వేసవిలో తిరిగి తెరుచుకోనున్న ఆలయ ద్వారాలు

శీతాకాలం ముగిసి వాతావరణ పరిస్థితులు అనుకూలించిన తర్వాత వచ్చే వేసవిలో కేదార్‌నాథ్ ఆలయ ద్వారాలను తిరిగి తెరవనున్నారు. అప్పటివరకు స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని ఉఖీమఠ్‌లోని ఓంకారేశ్వర్ ఆలయంలో ఉంచి నిత్య పూజలు నిర్వహిస్తారు.

ఇదిలా ఉండగా, చార్‌ధామ్ యాత్రలో భాగమైన యమునోత్రి ఆలయాన్ని కూడా శీతాకాలం నేపథ్యంలో బుధవారం మూసివేశారు. దీంతో హిమాలయ ప్రాంతంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో శీతాకాల విరామం ప్రారంభమైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *