
వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాల్లో పుణ్యస్నానాలు ఆచరించేందుకు ప్రత్యేకంగా ఎలాంటి ముహూర్తం అవసరం లేదని దేవదాయశాఖ కమిషనర్ కె. రామచంద్ర మోహన్ స్పష్టం చేశారు. ఈ విషయంపై వైదిక పండితులంతా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని తెలిపారు.
పుష్కరాలు జరిగే 12 రోజుల పాటు భక్తులు ఎప్పుడైనా పుణ్యస్నానాలు ఆచరించవచ్చని పేర్కొన్నారు. పుష్కరాల తొలి రోజు సూర్యోదయం నుంచి చివరి రోజు సూర్యాస్తమయం వరకు ఏ సమయంలోనైనా గోదావరిలో పవిత్ర స్నానం చేయవచ్చని రామచంద్ర మోహన్ వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్లో 2027లో జరగనున్న గోదావరి పుష్కరాల నిర్వహణకు ప్రభుత్వం సన్నాహాలు ముమ్మరం చేస్తోందని దేవాదాయశాఖ కమిషనర్ కె. రామచంద్ర మోహన్ తెలిపారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పుష్కరాల తేదీలను ఖరారు చేసిందని వెల్లడించారు. పుష్కరాల్లో పుణ్యస్నానాలు ఆచరించేందుకు ప్రత్యేకంగా ఎలాంటి ముహూర్తం అవసరం లేదని స్పష్టం చేశారు.
ఈ మేరకు రాజమహేంద్రవరంలోని దేవాదాయశాఖ కార్యాలయంలో పండితులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. గోదావరి పుష్కరాల ముహూర్తాలు, నిర్వహణకు సంబంధించిన వివిధ అంశాలపై వైదిక పండితులు, ఆధ్యాత్మిక ప్రముఖులు, అధికారులతో చర్చించారు. పుష్కరాల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు, భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలపై కూడా సమీక్షించినట్లు తెలిపారు.
2027 గోదావరి పుష్కరాలకు సంబంధించి జూన్ 26 నుంచి జులై 7 వరకు తేదీలను ఖరారు చేసినట్లు దేవాదాయశాఖ కమిషనర్ కె. రామచంద్ర మోహన్ తెలిపారు. పుష్కరాల మొదటి రోజు నుంచి 12వ రోజు వరకు ప్రతిరోజూ సూర్యోదయం నుంచి భక్తులు ఏ సమయంలోనైనా, ఏ ఘాట్లోనైనా పుణ్యస్నానాలు ఆచరించవచ్చని వెల్లడించారు. తొలి రోజు సూర్యోదయం నుంచి చివరి రోజు సూర్యాస్తమయం వరకు ఎప్పుడైనా స్నానం చేయవచ్చని స్పష్టం చేశారు. గోదావరి పుష్కరాల సమయంలో నదీ తీరంలోని ఏ రేవులో స్నానం చేసినా పుణ్యఫలమే లభిస్తుందని తెలిపారు.
పుష్కరాల సందర్భంగా గోదావరి తీరంలోని 12 ప్రాంతాల్లో హారతులు, యాగాలు, హోమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. పుష్కరాలకు ముందుగా గోష్పాద క్షేత్రం నుంచి కలశ యాత్ర చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు.
అలాగే గోదావరి తీరంలో సూర్య, బృహస్పతి ఆలయాలను నిర్మించనున్నట్లు రామచంద్ర మోహన్ తెలిపారు. యాత్రికులకు ఆధ్యాత్మిక పర్యాటకాన్ని మరింత చేరువ చేసేందుకు దేవాదాయశాఖ, పర్యాటకశాఖ, ఆర్టీసీ సంయుక్తంగా ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నాయని చెప్పారు.
ఇందులో భాగంగా 35 ఆలయాలను అనుసంధానిస్తూ ఆరు సర్క్యూట్లుగా విభజించి పర్యాటక ప్యాకేజీలు రూపొందించనున్నారు. ఒక్కో ప్యాకేజీలో ఆరు నుంచి ఏడు ఆలయాలను సందర్శించేలా ఏర్పాట్లు చేయనున్నారు. గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తులు తమకు నచ్చిన ఆలయాలను ఎంపిక చేసుకుని దర్శించుకునేలా ఈ ప్యాకేజీలు అందుబాటులోకి తీసుకురానున్నట్లు వివరించారు.
2027లో జరగనున్న గోదావరి పుష్కరాలకు సుమారు 10 కోట్ల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నట్లు దేవాదాయశాఖ కమిషనర్ కె. రామచంద్ర మోహన్ తెలిపారు. భారీ సంఖ్యలో యాత్రికులు తరలివచ్చే అవకాశం ఉండటంతో అన్ని ప్రభుత్వ శాఖలను సమన్వయం చేసుకుంటూ ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.
గోదావరి పుష్కరాల సందర్భంగా ఆరు జిల్లాల్లోని అన్ని ఘాట్లలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించేందుకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు.
పుష్కరాల ఏర్పాట్లలో భాగంగా దేవాదాయశాఖ పరిధిలో ఆరు జిల్లాల్లో మొత్తం రూ.126 కోట్ల అంచనా వ్యయంతో 563 పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిపారు. వీటిలో ఇప్పటికే 520 పనులకు పరిపాలనాపరమైన అనుమతులు లభించాయని వెల్లడించారు.
అలాగే 400కు పైగా పనులకు టెండర్ల ప్రక్రియ పూర్తయిందని, ప్రస్తుతం ఆయా పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయని వివరించారు. 2027 మార్చి నెలాఖరు నాటికి గోదావరి పుష్కరాలకు సంబంధించిన అన్ని అభివృద్ధి పనులను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు రామచంద్ర మోహన్ స్పష్టం చేశారు.
