
దేశంలోనే ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ఒకటైన ఐఐటీ బాంబేలో బీటెక్ సెకండ్ ఇయర్ విద్యార్థి ఆత్మహత్య ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. పరీక్షల్లో చాట్‌జీపీటీ సాయంతో కాపీ కొడుతూ పట్టుబడిన విద్యార్థిని ప్రొఫెసర్ పరీక్షా గది నుంచి బయటకు పంపినట్లు సమాచారం. ఈ ఘటనతో తీవ్ర మనస్తాపానికి గురైన విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.
అయితే, తమ కుమారుడి ఆత్మహత్యకు వేధింపులు, కుల వివక్షే కారణమని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో ఘటనపై విద్యార్థికి అత్యంత సన్నిహిత మిత్రుడు తాజాగా స్పందించారు. విద్యార్థి ఎదుర్కొన్న పరిస్థితులు, ఘటనకు దారితీసిన పరిణామాలపై ఆయన కీలక వివరాలను వెల్లడించారు.
ఐఐటీ బాంబే విద్యార్థి సాహిల్ రవీంద్ర వాకోడే ఆత్మహత్య ఘటనపై వస్తున్న కులవివక్ష ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని తాను బలంగా నమ్ముతున్నట్లు అతడి ప్రాణ స్నేహితుడు యతీష్ కుమార్ తెలిపారు. సాహిల్ ఆత్మహత్యకు ముందు తనలో ఎలాంటి మార్పు కనిపించలేదని, అతడు ఇలాంటి నిర్ణయం తీసుకుంటాడని తాను కనీసం ఊహించలేదని చెప్పారు.
బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న సాహిల్.. మిడ్-సెమిస్టర్ పరీక్షలో మొబైల్ ఫోన్, చాట్‌జీపీటీని ఉపయోగిస్తూ పట్టుబడిన అనంతరం క్యాంపస్‌లోని తన హాస్టల్ గదిలో మృతిచెందినట్లు సమాచారం.
పరీక్షకు నాలుగైదు రోజుల ముందు సాహిల్‌ను కలిశానని యతీష్ తెలిపారు. ఆ సమయంలో అతడు ఎప్పటిలాగే చాలా సాధారణంగా, సరదాగా, సంతోషంగా కనిపించాడని చెప్పారు. ‘‘పరీక్షకు నాలుగైదు రోజుల ముందు నేను తనను కలిశాను. ఎప్పటిలాగే సాధారణంగానే ఉన్నాడు. సరదాగా, కూల్‌గా, చాలా సంతోషంగా కనిపించాడు’’ అని ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరం విద్యార్థి అయిన యతీష్ కుమార్ తెలిపారు.
పరీక్ష రోజున జరిగిన పరిణామాలపై యతీష్ మాట్లాడుతూ.. సాహిల్ కాపీ కొడుతూ పట్టుబడ్డాడని చెప్పారు. ‘‘ప్రొఫెసర్ అతడిని పరీక్ష నుంచి బయటకు తీసుకెళ్లారు. సాహిల్‌పై ఎలాంటి క్రమశిక్షణా చర్యల కమిటీ విధించలేదని సంస్థ వెల్లడించింది. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు’’ అని యతీష్ పేర్కొన్నారు.
మొదటి సంవత్సరం క్యాంపస్‌లో అడుగుపెట్టిన రోజులను యతీష్ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నాడు. ‘‘నా మొదటి ఏడాదిలో అతడు నా పక్క గదిలోనే ఉండేవాడు. క్యాంపస్‌లో నాకు పరిచయమైన తొలి స్నేహితుల్లో అతడూ ఒకడు. ఇద్దరం కలిసి బ్యాడ్మింటన్ ఆడేవాళ్లం’’ అని చెప్పాడు. అయితే సాహిల్ వేరే విభాగానికి చెందిన విద్యార్థి కావడంతో, ఆ రోజు అసలు ఏం జరిగిందనే విషయంపై తనకు పూర్తి సమాచారం లేదని యతీష్ తెలిపాడు.
మరోవైపు, తమ కుమారుడు క్యాంపస్‌లో వేధింపులు, కుల వివక్షకు గురికావడం వల్లే ఆత్మహత్య చేసుకున్నాడని అతని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు ఎస్సీ, ఎస్టీ (అట్రాసిటీల నిరోధక) చట్టం, 1989 కింద కేసు నమోదు చేశారు. అయితే, క్యాంపస్‌లో జరిగిన ఘటనకు కులవివక్షే ప్రధాన కారణమని తాను భావించడం లేదని యతీష్ పేర్కొన్నాడు. ‘‘కులవివక్ష ఇక్కడ సమస్యగా ఉందని నేను అనుకోను. నేను వ్యక్తిగతంగా ఎప్పుడూ అలాంటి అనుభవాన్ని ఎదుర్కోలేదు’’ అని అతడు తెలిపాడు.
