
D Spiritual: Nov 13: రాష్ట్రవ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో నాగులచవితి వేడుకలు
కృష్ణా జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా నాగులచవితి వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుగుతున్నాయి. పండుగను పురస్కరించుకుని తెల్లవారుజామునే భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించి, సుబ్రహ్మణ్యస్వామి ఆలయాలు, నాగదేవత విగ్రహాలు ఉన్న ఆలయాలకు చేరుకుంటున్నారు.
ఈ సందర్భంగా భక్తులు నాగదేవతకు ప్రతీకగా భావించే పుట్టలకు పసుపు, కుంకుమలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అనంతరం పుట్టలో పాలు పోసి తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. నాగదేవతకు ప్రీతికరమైన పాలు, నువ్వుల పిండి, పెసరపప్పులను నైవేద్యంగా సమర్పించి, వాటిని ప్రసాదంగా భక్తులకు పంచిపెడుతున్నారు. దీంతో పుట్టల వద్ద భక్తుల రద్దీ నెలకొంది.
మోపిదేవి ఆలయంలో వైభవంగా నాగులచవితి వేడుకలు
కృష్ణా జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన మోపిదేవి శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో నాగులచవితి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. శుక్రవారం ఉదయం ఆలయ డిప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాద్ రావు వేడుకలను ప్రారంభించారు.
నాగులచవితిని పురస్కరించుకుని స్వామివారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. పుట్టలో పాలు పోసి నాగదేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు మోపిదేవికి చేరుకుంటున్నారు.
భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దర్శనం, పూజలు సజావుగా జరిగేలా అవసరమైన చర్యలు చేపట్టారు. దీంతో మోపిదేవి ఆలయంలో నాగులచవితి ఆధ్యాత్మిక సందడి నెలకొంది.
