
రైతుల కష్టాలు చూసి చలించిపోయి ఆర్థికంగా అండగా నిలిచిన వ్యక్తి.. అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకోవద్దని ధైర్యం చెప్పిన మనసున్న మనిషి.. ఎలాంటి భేషజాలు లేకుండా సామాన్యులతోనూ సులభంగా కలిసిపోయే స్వభావం.. ఆయనే ప్రముఖ నటుడు నానా పటేకర్. వెండితెరపై గంభీరమైన పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆయన, నిజ జీవితంలో మాత్రం ఎంతో సున్నితమైన మనసున్న వ్యక్తిగా గుర్తింపు పొందారు.
చిన్నతనంలో ఎదుర్కొన్న ఆకలి, ఆర్థిక ఇబ్బందులు ఆయన జీవితంపై చెరగని ముద్ర వేశాయి. అందుకే నటుడిగా కోట్ల రూపాయలు సంపాదించినప్పటికీ విలాసాలకు దూరంగా ఉంటూ, అవసరంలో ఉన్నవారికి తన వంతు సాయం చేస్తూ నిరాడంబర జీవితాన్ని గడిపారు.
కుటుంబ భారం మోసిన బాల్యం
నానా పటేకర్ తండ్రి తన స్నేహితుడి వద్ద అప్పు తీసుకుని, తెలియకుండానే కొన్ని పత్రాలపై సంతకాలు చేయడంతో కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో పడింది. ఈ పరిణామాలతో ఆయన తండ్రి అనారోగ్యానికి గురై మంచానికే పరిమితమయ్యారు. దీంతో కేవలం 13 ఏళ్ల వయసులోనే కుటుంబ బాధ్యతలు నానా పటేకర్‌పై పడ్డాయి.
కుటుంబాన్ని పోషించేందుకు ప్రతిరోజూ దాదాపు ఎనిమిది కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లి సినిమా పోస్టర్లకు రంగులు వేసేవారు. అందుకు నెలకు రూ.85 ఇచ్చేవారని, ఒకపూట భోజనం కూడా పెట్టేవారని గతంలో ఓ ఇంటర్వ్యూలో తన కష్టాలను గుర్తుచేసుకున్నారు.
ఆ సంపాదన తండ్రి మందులకే సరిపోయేదని, రెండోపూట భోజనం కోసం స్నేహితుల ఇళ్లకు వెళ్లేవాడినని చెప్పారు. భోజన సమయానికి వెళ్లడంతో వారు తనను కూడా తినమంటారేమోనని ఆశపడేవాడినని నాటి పరిస్థితులను వివరించారు.
రేప్ సీన్ చేయడానికి నిరాకరణ
పదో తరగతి పూర్తిచేసిన తర్వాత ఆర్ట్స్‌లో డిప్లొమా చేసిన నానా పటేకర్ జీవనోపాధి కోసం నాటకాల్లో నటించడం ప్రారంభించారు. రంగస్థలంపై తన ప్రతిభతో గుర్తింపు తెచ్చుకున్నారు. అప్పటి నటి స్మితా పాటిల్ సహకారంతో ‘ఆజ్ కీ ఆవాజ్’ సినిమాలో నటించే అవకాశం దక్కింది.
అయితే ఆ సినిమాలో రేప్ సన్నివేశంలో నటించాలని చెప్పడంతో ఆయన అందుకు నిరాకరించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. నానా పటేకర్ వ్యక్తిత్వం నచ్చిన దర్శకుడు తిరిగి పిలిచి అదే సినిమాలో మరో పాత్రను ఇచ్చారు. అలా చిన్నచిన్న అవకాశాలతో ప్రారంభమైన ఆయన సినీ ప్రయాణం.. క్రమంగా అగ్ర నటుల్లో ఒకరిగా ఎదిగే స్థాయికి చేరింది.
కోట్ల సంపాదన ఉన్నా.. సాధారణ జీవితం
వందలాది సినిమాల్లో నటించి విశేషమైన గుర్తింపు, సంపద సంపాదించినప్పటికీ నానా పటేకర్ విలాసవంతమైన జీవితానికి దూరంగా ఉన్నారు. దాదాపు 25 ఏళ్ల పాటు ఒకే సింగిల్ బెడ్రూం ఇంట్లో నివసించడం ఆయన నిరాడంబరతకు నిదర్శనం. సినీ కళాకారుల కోసం ప్రభుత్వం నిర్మించిన ఇంట్లోనే చాలా కాలం గడిపారు.
లగ్జరీ కార్లపై ఆసక్తి చూపని ఆయన.. దాదాపు 30 ఏళ్ల పాటు షూటింగ్‌లకు ఆటోలోనే ప్రయాణించేవారు. ఎంతటి స్థాయికి ఎదిగినా సాధారణ జీవనశైలిని కొనసాగించడం ఆయన ప్రత్యేకతగా నిలిచింది.
రైతులకు స్వయంగా ఆర్థిక సాయం
నానా పటేకర్ నటనకు మూడు జాతీయ అవార్డులు లభించాయి. అయితే రైతుల ఆత్మహత్యల వార్తలు ఆయనను తీవ్రంగా కలచివేశాయి. అప్పుల భారంతో ఇబ్బందులు పడుతున్న రైతు కుటుంబాలకు తన వంతుగా సాయం చేయాలని నిర్ణయించుకున్నారు.
ఆ సమయంలో ఒక్కో రైతు కుటుంబానికి రూ.15 వేల చొప్పున ఆర్థిక సహాయం అందించినట్లు కథనాల్లో పేర్కొన్నారు. మధ్యవర్తుల ద్వారా కాకుండా, సాయం నేరుగా బాధితులకు చేరాలనే ఉద్దేశంతో 100కు పైగా కుటుంబాలను స్వయంగా కలిశారు. తన దగ్గరున్న డబ్బు అయిపోయే వరకు సహాయం చేస్తానని కూడా ఓ సందర్భంలో తెలిపారు.
అవార్డులకు మించిన వ్యక్తిత్వం
నటుడిగా మూడు జాతీయ అవార్డులు, ఐదు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు, పద్మశ్రీ వంటి ఎన్నో గౌరవాలను నానా పటేకర్ అందుకున్నారు. అయినప్పటికీ అవార్డులే తన జీవితానికి కొలమానం కాదనే భావనతో ఉండేవారు. సినిమా పాత్రల కోసం సైనిక శిక్షణ తీసుకోవడం ద్వారా నటన పట్ల తన అంకితభావాన్ని చాటుకున్నారు.
తెరపై విలక్షణమైన పాత్రలతో ప్రేక్షకుల మనసుల్లో స్థానం సంపాదించుకున్న నానా పటేకర్.. నిజ జీవితంలోనూ తన సేవా గుణం, నిరాడంబరతతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన సినీ ప్రయాణం, మానవత్వంతో కూడిన వ్యక్తిత్వం అభిమానుల జ్ఞాపకాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి.
