
‘రామాయణ’ సినిమాలో సీత పాత్రకు సాయిపల్లవిని ఎంపిక చేయడంపై ఇటీవల సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ నటుడు ధనుష్ ఆమెకు మద్దతుగా నిలిచారు. సీత పాత్రలో సాయిపల్లవిని మించిన నటి మరొకరు ఉండరని ప్రశంసించారు. ఆమె నటనతో పాటు అంకితభావం, భక్తి, వ్యక్తిత్వాన్ని కొనియాడారు. తన తాజా చిత్రం ‘ఓం’ ప్రీ రిలీజ్ వేడుకలో ధనుష్ ఈ వ్యాఖ్యలు చేశారు.
సీత పాత్రలో సాయిపల్లవి నటనపై వస్తున్న విమర్శలు తనను ఆశ్చర్యానికి గురిచేశాయని ధనుష్ తెలిపారు. షూటింగ్ సమయంలో విరామం దొరికినా ఆమె ప్రార్థనలు చేస్తూ ఉండేవారని చెప్పారు. భగవంతుడిపై అపారమైన భక్తి ఉన్న వ్యక్తి అని, మనసు ఎంతో స్వచ్ఛమైనదని పేర్కొన్నారు. అందంతో పాటు అద్భుతమైన నటన ఆమె సొంతమని ప్రశంసించారు.
గతంలో ‘మారి 2’ సినిమాలో సాయిపల్లవితో కలిసి నటించిన ధనుష్, మరోసారి ‘ఓం’ చిత్రంలో ఆమెతో పనిచేయడం ఆనందంగా ఉందన్నారు. మొదటిసారి కలిసి పనిచేసినప్పుడు ఆమె చాలా మౌనంగా ఉండేవారని, కెమెరా ఆన్‌లో ఉన్నప్పుడే మాట్లాడేవారని గుర్తుచేసుకున్నారు. అయితే ఇప్పుడు నటనపై మరింత అవగాహన పెంచుకున్నారని చెప్పారు. ఆమె హావభావాలు, తెరపై కనిపించే తీరు ఆకట్టుకుంటాయని తెలిపారు.
సీత పాత్రను పోషించడం అంత సులభం కాదని, అయినప్పటికీ సాయిపల్లవి ఎంతో సహజంగా, అద్భుతంగా నటించారని ధనుష్ పేర్కొన్నారు.
ఇక ‘ఓం’ సినిమాలో సాయిపల్లవి నిత్యారెడ్డి అనే సీబీఐ అధికారిణి పాత్రలో కనిపించనున్నారు. ‘మారి 2’ తర్వాత ధనుష్, సాయిపల్లవి కలిసి నటిస్తున్న సినిమా ఇదే. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహించిన ఈ చిత్రం నవంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.
