
అగ్రనటుడు నందమూరి బాలకృష్ణ – డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్ మరోసారి తెలుగు సినిమా ప్రేక్షకుల్లో సంచలనాన్న సృష్టించేందుకు సిద్ధమైంది. ‘వీర సింహారెడ్డి’ బ్లాక్‌బస్టర్ విజయానంతరం ఈ జంట చేస్తున్న రెండో చిత్రం ‘#NBK111’ మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
తాజాగా ఈ ప్రాజెక్ట్ నుంచి సరికొత్త అప్‌డేట్ బయటకు వచ్చింది. పూజా కార్యక్రమాలతో సినిమా శుభారంభం జరిగినట్లు టీమ్ అధికారికంగా ప్రకటించింది. హిస్టారికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేయనున్నారని నిర్మాణ సంస్థ ఖరారు చేసింది.
ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పవర్‌ఫుల్ పోస్టర్ మాత్రం ప్రేక్షకుల గుండెల్లో గుబులు రేపేలా ఉంది. ఒక వైపు రుద్రాక్షమాల ధరించిన ఘోర రూపంలో శక్తివంతమైన అవతారం, మరో వైపు యుద్ధ భూమిని చెదరగొట్టే రాజసమైన యోధుడి లుక్ — రెండు కోటలను నేపథ్యంగా తీసుకుని రూపొందించిన ఈ పోస్టర్ గోపీచంద్ మలినేని బాలయ్య కోసం ఏ స్థాయిలో మేకింగ్ ప్లాన్ చేస్తున్నారో స్పష్టంగా చెబుతోంది.
ఇక బాలకృష్ణ సరసన నయనతారను తీసుకోవడం ఈ సినిమాకు మరో ముఖ్య ఆకర్షణ. ‘సింహా’, ‘జైసింహా’, ‘శ్రీరామరాజ్యం’ వంటి హిట్ చిత్రాల తర్వాత వీరి కాంబోలో వస్తున్న నాలుగో సినిమా కావడం సినిమాపై ప్రత్యేక క్రేజ్‌ను పెంచింది.
సంగీత విభాగంలో థమన్ చేరడం ఈ ప్రాజెక్ట్‌కు మరింత బలం చేకూరుస్తోంది. ‘అఖండ’, ‘వీర సింహారెడ్డి’, ‘భగవంత్ కేసరి’, ‘డాకు మహారాజ్’ చిత్రాల్లో థమన్–బాలయ్య కాంబో ఇచ్చిన ఎనర్జీ ప్రేక్షకులు ఇప్పటికీ మర్చిపోలేదు. త్వరలోనే ఈ సంచలన కాంబినేషన్ నుంచి ‘అఖండ 2’ కూడా రాబోతుండటం మరింత హైప్‌ను సృష్టిస్తోంది.
