పిఠాపురం: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కల్యాణ్ రెండు రోజుల పిఠాపురం పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. సుందరీకరణ, ఆధునీకరణ పనులు పూర్తిచేసుకున్న ఎఫ్‌కే పాలెం (ఫకృద్ధీన్‌పాలెం) మైసమ్మ చెరువును ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్‌తో పాటు ఇతర సౌకర్యాలను అభివృద్ధి చేశారు.

పిఠాపురం నియోజకవర్గంలో మౌలిక వసతులు, తాగునీరు, రహదారులు, పర్యావరణ పరిరక్షణ, తీర రక్షణ, మత్స్యకారుల సంక్షేమం, మహిళల ఆర్థిక సాధికారతకు సంబంధించి సుమారు రూ.1,500 కోట్ల విలువైన పనులకు ఈ పర్యటనలో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు.

పర్యటనలో భాగంగా చందుర్తి–తాటిపర్తి బీటీ రోడ్డుతో పాటు పిఠాపురం పట్టణంలోని పీఠికాపురవనం అర్బన్ ఫారెస్ట్‌ను కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు. రూ.9.59 కోట్లతో ఆధునీకరించిన నాగులాపల్లి సమగ్ర రక్షిత తాగునీటి పథకం ద్వారా 52 ఆవాసాల్లోని సుమారు 97 వేల మందికి తాగునీటి సదుపాయం కలగనుంది.

మంగళవారం నిర్వహించే బహిరంగ సభలో పలు కీలక ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్నారు. ఇందులో రూ.307 కోట్లతో బహుళ గ్రామాల తాగునీటి పథకం, రూ.200 కోట్లతో పిఠాపురం భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, రూ.80 కోట్లతో గొల్లప్రోలు వాటర్ వర్క్స్, రూ.100 కోట్ల రహదారి పనులు ఉన్నాయి. అలాగే రూ.118 కోట్లతో రోడ్ ఓవర్ బ్రిడ్జి, రూ.323 కోట్లతో ఉప్పాడ తీర రక్షణ గోడ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు.

మత్స్యకారులకు ఆధునిక లైఫ్ జాకెట్లు, ఇతర భద్రతా పరికరాలను అందించడంతో పాటు మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ.120 కోట్ల రుణాల కల్పనకు కూడా చర్యలు చేపట్టనున్నారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే పిఠాపురం నియోజకవర్గంలో తాగునీరు, రహదారులు, డ్రైనేజీ, తీర రక్షణ తదితర మౌలిక వసతులు మరింత మెరుగుపడే అవకాశం ఉంది.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *