బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు మరింత పెరిగే అవకాశం ఉంది. అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ బలపడుతున్న నేపథ్యంలో కోస్తాంధ్రకు వాతావరణశాఖ భారీ వర్షాల హెచ్చరికలు జారీ చేసింది. సెప్టెంబర్ 21 నుంచి 24 వరకు పలు ప్రాంతాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.

మంగళవారం నుంచి కోస్తాంధ్రలో వర్షాల తీవ్రత పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశముంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలతో పాటు బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.

తీరం వెంబడి వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా ఉండే అవకాశం ఉన్నందున మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇప్పటికే సముద్రంలో ఉన్న మత్స్యకారులు వీలైనంత త్వరగా తీరానికి చేరుకోవాలని అధికారులు సూచించారు.

అల్పపీడనం ప్రభావంతో ఇప్పటికే ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. రాయలసీమతో పాటు కోస్తా జిల్లాల్లోనూ పలుచోట్ల వర్షాలు నమోదయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా.. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కొన్ని చోట్ల గాలుల ప్రభావంతో అరటి వంటి పంటలకు నష్టం వాటిల్లినట్లు సమాచారం.

రానున్న రోజుల్లో వర్షాలు మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో అధికారుల సూచనలు పాటించాలని విపత్తు నిర్వహణ అధికారులు సూచిస్తున్నారు.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *