టీ20 ప్రపంచకప్ 2026లో భారత్.. సెమీఫైనల్‌లో అడుగుపెట్టింది. సూపర్-8లో తమ చివరి మ్యాచ్‌లో వెస్టిండీస్‌ను ఓడించి.. పాయింట్స్ టేబుల్‌లో రెండో స్థానంలోకి దూసుకెళ్లింది. గ్రూప్-1 నుంచి దక్షిణాఫ్రికాతో పాటు సెమీఫైనల్‌కు చేరుకుంది. టీమిండియా సెమీఫైనల్‌లో మార్చి 5న ఇంగ్లాండ్‌తో తలపడనుంది. మరో సెమీ ఫైనల్‌లో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ అమీతుమీ తేల్చుకోనున్నాయి.

టీ20 ప్రపంచకప్ 2026లో టీమిండియా సెమీఫైనల్ చేరింది. సూపర్-8లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. వర్చువల్ నాకౌట్ లాంటి మ్యాచ్‌లో సత్తాచాటి.. గ్రూప్-1 నుంచి సెమీస్ చేరిన రెండో జట్టుగా నిలిచింది. 196 పరుగులను డిఫెండ్ చేసుకోలేకపోయిన వెస్టిండీస్.. టోర్నీ నుంచి నిష్క్రమించింది. భారత జట్టు.. సెమీఫైనల్‌లో మార్చి 5న ఇంగ్లాండ్‌తో తలపడనుంది.

కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఈ మ్యాచ్ జరిగింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాను.. ఓపెనర్ సంజూ శాంసన్ ఒంటి చేత్తో గెలిపించాడు. ఈ టోర్నీ ఆరంభంలో తుది జట్టులో చోటు కోల్పోయిన అతడు.. కీలకమైన మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేశాడు.