
ఆంధ్రప్రదేశ్‌ను మారిటైమ్ టెక్నాలజీ, రోబోటిక్స్ రంగాల్లో కీలక కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా మంత్రి నారా లోకేష్ పలు ప్రతిపాదనలు చేశారు. విశాఖపట్నంలో జరుగుతున్న సీఐఐ భాగస్వామ్య సదస్సు రెండో రోజు సాగర్ డిఫెన్స్ వ్యవస్థాపకుడు కెప్టెన్ నికుంజ్ పరాశర్‌తో ఆయన సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా జువ్వలదిన్నెను ఇండో-పసిఫిక్ ప్రాంతానికి ఎగుమతుల కేంద్రంగా అభివృద్ధి చేయాలని సూచించారు. ఐఐటీ తిరుపతి, ఆంధ్రా యూనివర్సిటీ భాగస్వామ్యంతో మారిటైమ్ అటానమీ, రోబోటిక్స్ స్కిల్లింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరారు. యువతకు ప్రత్యేక నైపుణ్య శిక్షణ అందించేలా చర్యలు తీసుకోవాలని ప్రతిపాదించారు.
జువ్వలదిన్నెను మానవరహిత నౌకల సముద్ర పరీక్షలు, నిర్వహణ, మరమ్మతులు, ఫ్లీట్ సపోర్ట్ కార్యకలాపాలకు కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం సహకరిస్తుందని లోకేష్ తెలిపారు. ఏపీ మారిటైమ్ బోర్డు పరిధిలోని పోర్టుల్లో హార్బర్ భద్రత, హైడ్రోగ్రాఫిక్ సర్వేల కోసం మానవరహిత నౌకల పైలట్ ప్రాజెక్టులు చేపట్టాలని సూచించారు.
అలాగే ఎండ్యూర్ ఎయిర్, సాగర్ సంస్థల డ్రోన్ల తయారీ కార్యకలాపాలను ఏపీకి ఆహ్వానించారు. కాంపోజిట్స్, బ్యాటరీలు, సెన్సార్లు, ఎలక్ట్రానిక్స్ వంటి అనుబంధ పరిశ్రమలను నెల్లూరులో ఏర్పాటు చేయాలని కోరారు. స్థానిక మత్స్యకార కుటుంబాలకు ఉద్యోగాల్లో ప్రాధాన్యత కల్పించాలని సూచించారు.
సాగర్ డిఫెన్స్ వ్యవస్థాపకుడు కెప్టెన్ నికుంజ్ పరాశర్ మాట్లాడుతూ.. తమ సంస్థ లిక్విడ్ రోబోటిక్స్, ఎండ్యూర్ ఎయిర్ సిస్టమ్స్‌లో వ్యూహాత్మక పెట్టుబడులు పెట్టినట్లు వెల్లడించారు. ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన అవకాశాలను పరిశీలించి తదుపరి కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
