
ఇంద్రకీలాద్రి, విజయవాడ ఇంద్రకీలాద్రి దిగువన కనకదుర్గనగర్‌లో ఉన్న చారిత్రక అక్కన్న మాదన్న గుహలను శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ట్రస్ట్‌బోర్డు చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ), ఈవో వి.కె. శీనా నాయక్ ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా గుహల్లో కొలువుదీరిన పరమేశ్వరుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం గుహల ప్రాంగణంలోని అరుదైన కిరాతార్జున శాసన స్తంభాన్ని వారు నిశితంగా పరిశీలించారు. అక్కడి ప్రాచీన కుడ్యచిత్రాలు, అద్భుతమైన శిల్పకళా సంపదను ఆసక్తిగా తిలకించారు. ఇంద్రకీలాద్రిపై ఉన్న ప్రాచీన పాశుపతాలయం చారిత్రక నేపథ్యం, కిరాతార్జున శాసన స్తంభం విశిష్టత, దాని వెనుక ఉన్న పురాణ సంబంధాల గురించి అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
ఇంద్రకీలాద్రి క్షేత్ర చరిత్రలో ప్రత్యేక స్థానం కలిగిన పాశుపతాలయం ప్రాధాన్యతను, అందుకు సంబంధించిన చారిత్రక ఆధారాలను దేవాదాయశాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి వివరించనున్నట్లు చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో వి.కె. శీనా నాయక్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో దేవస్థానం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
