D Spiritual: Nov 13: త్రిమూర్తుల ఏకస్వరూపంగా విరాజిల్లే శ్రీ దత్తాత్రేయస్వామివారికి శ్రీశైల దేవస్థానం ఆధ్వర్యంలో గురువారం ఆలయ ప్రాంగణంలోని త్రిఫలవృక్షం చెంత విశేష పూజాకైంకర్యాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ ప్రతి గురువారం దేవస్థానం సర్కారీ సేవగా ఈ విశేష పూజలను సంప్రదాయబద్ధంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా తొలుత మహాగణపతి పూజ నిర్వహించి, అనంతరం దత్తాత్రేయస్వామివారికి పంచామృతాభిషేకం, విశేష పూజలను శాస్త్రోక్తంగా సమర్పించారు.

బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఒకే స్వరూపంలో దత్తాత్రేయునిగా అవతరించడంతో ఆయన త్రిమూర్తి స్వరూపునిగా ప్రసిద్ధి చెందారు. శ్రీశైల క్షేత్రంతో దత్తాత్రేయస్వామివారికి ఎంతో విశిష్టమైన అనుబంధం ఉంది. ఆలయ ప్రాంగణంలోని త్రిఫలవృక్షం కింద దత్తాత్రేయస్వామివారు తపస్సు ఆచరించినట్లు స్థలపురాణం పేర్కొంటోంది. అందువల్ల ఈ వృక్షం దత్తాత్రేయ వృక్షంగా ప్రసిద్ధి చెందింది.

కలియుగంలో గోదావరి తీరంలోని పిఠాపురంలో శ్రీపాద వల్లభునిగా అవతరించిన దత్తాత్రేయస్వామివారు శ్రీశైల క్షేత్రంలో చాతుర్మాస్య వ్రతాన్ని ఆచరించినట్లు గురుచరిత్రలో ప్రస్తావించబడింది. అనంతరం నృసింహసరస్వతి స్వామిగా అవతరించిన ఆయన మహాశివరాత్రి పర్వదినాన శ్రీశైల మల్లికార్జున స్వామివారిని సేవించినట్లు గురుచరిత్ర తెలియజేస్తోంది.

అంతేకాకుండా, నృసింహసరస్వతి స్వామివారు తమ అవతార సమాప్తిని శ్రీశైలంలోని పాతాళగంగ సమీపంలో ఉన్న కదళీవనంలో చేసినట్లు గురుచరిత్రలో విశేషంగా వివరించబడింది. ఈ నేపథ్యంలో శ్రీశైల క్షేత్రంలో దత్తాత్రేయస్వామివారికి నిర్వహించే విశేష పూజలు భక్తులకు ఆధ్యాత్మిక చింతనను, భక్తిభావాన్ని కలిగిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *