
D Spiritual: Nov 11: టీటీడీ సాధికారిక మండలి సభ్యుడిగా వినయ్ చంద్ ప్రమాణస్వీకారం
టీటీడీ సాధికారిక మండలి సభ్యుడిగా ఆంధ్రప్రదేశ్ ఆర్థికశాఖ కార్యదర్శి శ్రీ వి. వినయ్ చంద్ బుధవారం ప్రమాణస్వీకారం చేశారు. తిరుమల శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి వద్ద నిర్వహించిన కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో శ్రీ సీహెచ్ వెంకయ్య చౌదరి ఆయనతో ప్రమాణం చేయించారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించి శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు.
ఈ సందర్భంగా ఆలయం ముందు మీడియాతో మాట్లాడిన వినయ్ చంద్.. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవేంకటేశ్వరస్వామి సన్నిధిలో టీటీడీ సాధికారిక మండలి సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేయడం తన పూర్వజన్మ సుకృతమని పేర్కొన్నారు.
తనపై నమ్మకం ఉంచి ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. సాధికారిక మండలి సభ్యుడిగా బాధ్యతల్లో ఉన్నంతకాలం మండలి చైర్మన్ శ్రీ ముద్దాడ రవిచంద్ర, మరో సభ్యుడు శ్రీ కె. కన్నబాబుతో సమన్వయం చేసుకుంటూ పనిచేస్తానన్నారు. భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించేందుకు తనవంతు కృషి చేస్తానని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో సీవీఎస్వో శ్రీ మురళీకృష్ణ, శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ భాస్కర్, బోర్డు సెల్ డిప్యూటీ ఈవో శ్రీమతి ప్రశాంతి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
