
జిల్లాలో పెద్దపులి సంచారం స్థానికంగా తీవ్ర ఆందోళనకు దారితీస్తోంది. రెడ్డిగూడెం మండలం అన్నేరావుపేట అటవీ ప్రాంతంలో ఉన్న పెద్దపులి అర్ధరాత్రి సుమారు 40 కిలోమీటర్లు ప్రయాణించి చీమలపాడు అటవీ ప్రాంతానికి చేరుకున్నట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. మార్గమధ్యంలో జాతీయ రహదారిని దాటి మరో అటవీ ప్రాంతంలోకి ప్రవేశించినట్లు సమాచారం.
పెద్దపులికి గతంలోనే అమర్చిన ట్రాకర్ సాయంతో అధికారులు దాని కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. చీమలపాడు అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తున్నట్లు గుర్తించిన అధికారులు అది ఏ దిశగా వెళ్తుందనే అంశంపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.
ఈ నేపథ్యంలో తిరువూరు రెవెన్యూ అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. అటవీ ప్రాంతాలకు సమీపంలోని గ్రామాల ప్రజలు, రైతులు, వ్యవసాయ కూలీలు జాగ్రత్తగా ఉండాలని తిరువూరు ఆర్డీవో ఏ. కుమార్ సూచించారు. ముఖ్యంగా పొలాలకు ఒంటరిగా వెళ్లవద్దని హెచ్చరించారు. పెద్దపులి కనిపిస్తే దాని దగ్గరకు వెళ్లే ప్రయత్నం చేయకుండా వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించాలని కోరారు.
