
టాలీవుడ్ ప్రముఖ పాటల రచయిత చేగొండి అనంత శ్రీరామ్ కుటుంబం రాజకీయాల్లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. ఆయన తల్లి ఉమారాణి పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలంలోని దొడ్డిపట్ల గ్రామ సర్పంచ్‌గా పోటీ చేయాలనే ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో అనంత శ్రీరామ్ తల్లిదండ్రులు జనసేన పార్టీలో చేరారు.
దొడ్డిపట్ల గ్రామ సర్పంచ్ పదవిని జనరల్ మహిళకు కేటాయించడంతో తన తల్లి ఉమారాణికి అవకాశం కల్పించాలని అనంత శ్రీరామ్ కోరుతున్నారు. ప్రస్తుతం ఆయన గ్రామంలోనే ఉంటూ తన తల్లి ఏకగ్రీవంగా ఎన్నికయ్యేలా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, సర్పంచ్ పదవికి మరో అభ్యర్థి కూడా పోటీలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తుండటంతో గ్రామ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి.
ప్రముఖ తెలుగు సినీ గీత రచయిత అనంత శ్రీరామ్ తల్లిదండ్రులు చేగొండి వీర వెంకట సత్యనారాయణమూర్తి, ఉమారాణి ఇటీవల జనసేన పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గ పరిధిలోని యలమంచిలి మండలం దొడ్డిపట్ల గ్రామ సర్పంచ్ పదవికి అనంత శ్రీరామ్ తల్లి ఉమారాణి పోటీ చేయాలని భావిస్తున్నారు.
దొడ్డిపట్ల గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవిని జనరల్ మహిళకు కేటాయించారు. ఈ గ్రామంలో మూడో విడతలో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో తన తల్లికి సర్పంచ్‌గా అవకాశం కల్పించాలని అనంత శ్రీరామ్ ఇప్పటికే స్థానిక జనసేన నేతలను కోరినట్లు తెలుస్తోంది. ఇందుకోసం గ్రామంలో రాజకీయ సమీకరణాలను అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.
దొడ్డిపట్ల గ్రామ సర్పంచ్ పదవికి కూటమికి చెందిన మరో నాయకుడి నుంచి పోటీ ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. జనసేన పార్టీలో చేరితే సర్పంచ్ అభ్యర్థిత్వానికి అవకాశం లభిస్తుందనే ప్రచారం నేపథ్యంలో ఈ నెల 18న అనంత శ్రీరామ్ తల్లిదండ్రులు జనసేనలో చేరారు. తమ కుటుంబానికి అవకాశం కల్పిస్తే గ్రామాభివృద్ధికి కృషి చేస్తామని అనంత శ్రీరామ్ చెబుతున్నారు. పార్టీలకు అతీతంగా తన తల్లిని ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు సహకరించాలని గ్రామస్థులను కోరుతున్నారు. ఇందులో భాగంగా గత నాలుగు రోజులుగా దొడ్డిపట్లలోనే ఉంటూ స్థానికులతో చర్చలు జరుపుతున్నారు.
మరోవైపు, తన తల్లికి సర్పంచ్‌గా అవకాశం కల్పించాలని జనసేన జిల్లా అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావుతో పాటు ఇతర పార్టీ నాయకులను కూడా అనంత శ్రీరామ్ కోరినట్లు ప్రచారం జరుగుతోంది. ఆయన ప్రతిపాదనపై గ్రామ పెద్దలు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవమయ్యేలా ప్రయత్నిస్తున్నామని, అందుకు గ్రామస్థులు సహకరిస్తే గ్రామాభివృద్ధికి తన వంతు సాయం అందిస్తానని అనంత శ్రీరామ్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అవసరమైన అభివృద్ధి పనులకు తనకు చేతనైన ఆర్థిక సహకారం కూడా అందిస్తానని చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది.
మొత్తానికి తన తల్లిని సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకునేలా గ్రామస్థులను ఒప్పించేందుకు అనంత శ్రీరామ్ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా డిసెంబర్ 2న పోలింగ్ జరగనుంది. నవంబర్ 21 నుంచి 23 వరకు నామినేషన్ల స్వీకరణకు గడువు ఉంది. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో పాటు గడువు ముగియడానికి కేవలం మూడు రోజులే ఉండటంతో దొడ్డిపట్ల సర్పంచ్ ఎన్నిక ఆసక్తికరంగా మారింది.
