
గ్రీన్‌లాండ్ భద్రత, రక్షణ అవసరాల విషయంలో అమెరికాకు దీర్ఘకాలిక హక్కులు కల్పించేలా ఒప్పందం రూపొందినట్లు ట్రంప్ పేర్కొన్నారు. గ్రీన్‌లాండ్‌లో అమెరికా అనుమతి లేకుండా తమ ప్రత్యర్థి దేశాలు సైనిక స్థావరాలు ఏర్పాటు చేయడం, సైనిక బలగాలను మోహరించడం లేదా కొన్ని కీలక పెట్టుబడులు పెట్టడం సాధ్యం కాదని తెలిపారు.
గ్రీన్‌లాండ్‌లో అమెరికా సైనిక ఉనికిని మరింత పెంచేందుకు చర్యలు ప్రారంభిస్తామని ట్రంప్ ప్రకటించారు. అనువైన ప్రాంతంలో భారీ సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేసే ప్రక్రియను వెంటనే ప్రారంభిస్తామని, ఈ అభివృద్ధి, నిర్మాణ కార్యక్రమాల్లో గ్రీన్‌లాండ్ ప్రజలతో కలిసి పనిచేస్తామని చెప్పారు.
అయితే, ఈ ఒప్పందం గ్రీన్‌లాండ్ డెన్మార్క్ నుంచి అమెరికాకు బదిలీ అవుతుందని అర్థం కాదని డెన్మార్క్, గ్రీన్‌లాండ్ వర్గాలు స్పష్టం చేశాయి. గ్రీన్‌లాండ్ సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రత, ప్రజల స్వయం నిర్ణయ హక్కులను ఈ ఒప్పందం గుర్తిస్తుందని పేర్కొన్నాయి.
డెన్మార్క్, గ్రీన్‌లాండ్ ప్రభుత్వాల ప్రకారం.. ఒప్పందంపై వచ్చే వారం సంతకాలు చేసే అవకాశం ఉంది. అనంతరం అవసరమైన పార్లమెంటరీ ప్రక్రియలు పూర్తయిన తర్వాతే ఇది అమల్లోకి రానుంది.
గ్రీన్‌లాండ్ ఆర్కిటిక్ ప్రాంతంలో వ్యూహాత్మకంగా కీలకమైన ప్రాంతం కావడంతో అమెరికా, రష్యా, చైనా సహా పలు దేశాలకు ఇది ప్రాధాన్యంగా ఉంది. ఇప్పటికే గ్రీన్‌లాండ్‌లో అమెరికాకు సైనిక స్థావరం ఉంది. తాజా ఒప్పందం ద్వారా అక్కడ తన సైనిక, భద్రతా ఉనికిని మరింత విస్తరించేందుకు అమెరికాకు అవకాశం లభించనుంది.
