కంప్యూటర్‌లో వాట్సాప్ వెబ్ ఉపయోగిస్తున్నారా? అయితే చిన్న నిర్లక్ష్యం మీ వ్యక్తిగత సమాచారాన్ని సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి చేర్చవచ్చు. వాట్సాప్ వెబ్ సెషన్ నుంచి లాగౌట్ కాకపోతే మెసేజ్‌లు చదవడం, మీ పేరుతో సందేశాలు పంపడం, కాంటాక్టులు, గ్రూప్ చాట్‌లను యాక్సెస్ చేసే ప్రమాదం ఉందని భారత సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C) హెచ్చరించింది.
చాలామంది వాట్సాప్ వెబ్‌పై ఆధారపడుతున్నారు. అయితే దీనిని ఉపయోగించేటప్పుడు చేసే చిన్న నిర్లక్ష్యం సైబర్ నేరగాళ్లకు అవకాశం కల్పించవచ్చు. ఈ నేపథ్యంలో వాట్సాప్ వెబ్ వినియోగదారులను భారత సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C) పరిధిలోని నేషనల్ సైబర్‌క్రైమ్ థ్రెట్ అనలిటిక్స్ యూనిట్ (NCTAU) అప్రమత్తం చేసింది.

చాలామంది వాట్సాప్ వెబ్‌పై ఆధారపడుతున్నారు. అయితే దీనిని ఉపయోగించేటప్పుడు చేసే చిన్న నిర్లక్ష్యం సైబర్ నేరగాళ్లకు అవకాశం కల్పించవచ్చు. ఈ నేపథ్యంలో వాట్సాప్ వెబ్ వినియోగదారులను భారత సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C) పరిధిలోని నేషనల్ సైబర్‌క్రైమ్ థ్రెట్ అనలిటిక్స్ యూనిట్ (NCTAU) అప్రమత్తం చేసింది.
కంప్యూటర్‌లో వాట్సాప్ వెబ్‌కు లాగిన్ అయిన తర్వాత లాగౌట్ చేయడం మర్చిపోతే మీ వ్యక్తిగత సమాచారం ఇతరుల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ముఖ్యంగా ఆఫీసు కంప్యూటర్లు, షేర్డ్ సిస్టమ్స్, పబ్లిక్ కంప్యూటర్లలో ఈ ముప్పు ఎక్కువగా ఉంటుందని తెలిపింది. ఒకసారి వెబ్ సెషన్ యాక్టివ్‌గా ఉండిపోతే, ఆ కంప్యూటర్‌ను ఉపయోగించే ఇతరులు మీ మెసేజ్‌లు చదవడం, మీ పేరుతో సందేశాలు పంపడం, కాంటాక్టులు, గ్రూప్ చాట్లను పరిశీలించడం వంటివి చేయవచ్చు. అంతేకాదు.. మీ ఖాతాను ఉపయోగించి ఫిషింగ్ లింకులు పంపడం, ఇతరులను మోసం చేయడం వంటి సైబర్ నేరాలకు పాల్పడే అవకాశం కూడా ఉంది.
అందుకే వాట్సాప్ వెబ్ ఉపయోగించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని సైబర్ భద్రతా విభాగం సూచిస్తోంది
వాట్సాప్ వెబ్ వాడేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి:
పని పూర్తయ్యాక లాగౌట్ చేయండి: వాట్సాప్ వెబ్ ఉపయోగించిన ప్రతిసారీ తప్పనిసరిగా లాగౌట్ అవ్వాలి. బ్రౌజర్ ట్యాబ్ మూసివేయడం మాత్రమే సరిపోదు.
పబ్లిక్ కంప్యూటర్లకు దూరంగా ఉండండి: సైబర్ కేఫ్‌లు, హోటళ్లు, ఇతరులు ఉపయోగించే కంప్యూటర్లలో వాట్సాప్ వెబ్ లాగిన్ చేయకపోవడమే మంచిది.
సున్నితమైన సమాచారం పంపవద్దు: ప్రభుత్వ, సంస్థాగత, ఆర్థిక, రహస్య సమాచారాన్ని వాట్సాప్ వెబ్ ద్వారా పంపకుండా ఉండాలి.
ఇన్‌కాగ్నిటో మోడ్ ఉపయోగించండి: తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేట్ బ్రౌజింగ్ మోడ్‌లో వాట్సాప్ వెబ్‌ను ఉపయోగించవచ్చు. అయితే పని పూర్తయ్యాక లాగౌట్ చేయడం మర్చిపోవద్దు.
అనుమానాస్పద కార్యకలాపాలను గమనించండి: మీకు తెలియకుండా మెసేజ్‌లు వెళ్లడం, ఖాతాలో అసాధారణ మార్పులు కనిపించడం వంటివి ఉంటే వెంటనే అప్రమత్తం కావాలి.
సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేయండి: కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్, బ్రౌజర్, సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్‌లను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవాలి.
తెలియని ఫైళ్లను డౌన్‌లోడ్ చేయవద్దు: అనుమానాస్పద ఫైళ్లు, క్రాక్డ్ సాఫ్ట్‌వేర్‌లకు దూరంగా ఉండాలి.
మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. మీ వాట్సాప్ ఖాతాలో లింక్ అయిన పరికరాలను (Linked Devices) ఎప్పటికప్పుడు పరిశీలించాలి. మీకు తెలియని పరికరం ఏదైనా కనిపిస్తే వెంటనే దాన్ని లాగౌట్ చేయాలి.
మొత్తానికి వాట్సాప్ వెబ్ ఉపయోగించడం ప్రమాదకరం కాదు.. కానీ ఉపయోగించిన తర్వాత లాగౌట్ చేయకపోవడమే సమస్యలకు కారణం కావచ్చు. కాబట్టి చిన్న నిర్లక్ష్యం కారణంగా మీ వ్యక్తిగత సంభాషణలు, డిజిటల్ గుర్తింపు ఇతరుల చేతుల్లోకి వెళ్లకుండా జాగ్రత్తపడండి.




