విశాఖపట్నం రైల్వే స్టేషన్‌ను అత్యాధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేసేందుకు చేపట్టిన పనులు వేగంగా కొనసాగుతున్నాయి. సుమారు రూ.660 కోట్ల వ్యయంతో ఈ ఆధునికీకరణ ప్రాజెక్టును చేపడుతున్నారు. ఇందులో భాగంగా ప్రయాణికులకు మెరుగైన వసతులు కల్పించడంతో పాటు స్టేషన్‌ను ఆధునిక హంగులతో తీర్చిదిద్దనున్నారు.

ఈ ప్రాజెక్టులో భాగంగా మొత్తం 14 ప్లాట్‌ఫారాలు, 72 మీటర్ల వెడల్పుతో భారీ ఎయిర్ కాన్‌కోర్స్ నిర్మించనున్నారు. సుమారు 4,000 మంది ప్రయాణికులు ఒకేసారి వేచి ఉండేందుకు వీలుగా ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు. అంతేకాకుండా ఆధునిక ఫుడ్ కోర్టులు, రిటైల్ షాపులు, ఏసీ లాంజ్‌లను అందుబాటులోకి తీసుకురానున్నారు.

వాహనాల పార్కింగ్ కోసం 450 కార్లు, 2,000 ద్విచక్ర వాహనాలు నిలిపేలా సదుపాయాలు కల్పించనున్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు, వర్షపు నీటి సంరక్షణ, మురుగునీటి శుద్ధి, పునర్వినియోగ సదుపాయాలను కూడా ప్రాజెక్టులో భాగంగా చేపడుతున్నారు.

ఈ పనులు పూర్తయితే విశాఖపట్నం రైల్వే స్టేషన్ మరింత ఆధునికంగా మారడంతో పాటు ప్రయాణికులకు మెరుగైన ప్రయాణ అనుభవం అందుబాటులోకి రానుంది.

విశాఖపట్నం రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులు మరింత వేగం పుంజుకున్నాయి. ఈ ప్రాజెక్టుకు సంబంధించి రైల్వే శాఖ తాజాగా కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రస్తుతం స్టేషన్‌లో ఉన్న 8 ప్లాట్‌ఫారాలను 14కి పెంచేందుకు ఆమోదం తెలిపింది. ఈ విస్తరణ పూర్తయితే దేశంలో అత్యధిక ప్లాట్‌ఫారాలు కలిగిన ఐదు ప్రధాన రైల్వే స్టేషన్లలో విశాఖపట్నం కూడా చేరనుంది.

మరోవైపు స్టేషన్‌లో నిర్మించనున్న ఇతర భవనాల డిజైన్లలోనూ రైల్వే బోర్డు పలు మార్పులు చేసింది. ప్లాట్‌ఫారాల విస్తరణతో పాటు అదనపు నిర్మాణాలు, ఆధునిక సదుపాయాలను పరిగణనలోకి తీసుకుని ప్రాజెక్టు వ్యయ అంచనాలను సవరించింది. గతంలో రూ.450 కోట్లుగా ఉన్న ఈ ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని తాజాగా రూ.660 కోట్లకు పెంచింది. దీంతో విశాఖ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ ప్రాజెక్టు మరింత విస్తృతంగా రూపుదిద్దుకోనుంది

రైల్వే స్టేషన్‌కు ఇరువైపులా నిర్మించే భవనాలను అనుసంధానిస్తూ 72 మీటర్ల వెడల్పుతో భారీ ఎయిర్ కాన్‌కోర్స్‌ను ఏర్పాటు చేయనున్నారు. విమానాశ్రయ టెర్మినల్ తరహాలో దీన్ని తీర్చిదిద్ది, ఒకేసారి సుమారు 4 వేల మంది ప్రయాణికులు వేచి ఉండేలా ఆధునిక సదుపాయాలు కల్పించనున్నారు. అలాగే స్టేషన్ సమీపంలో 450 కార్లు, 2 వేల ద్విచక్ర వాహనాలు పార్కింగ్ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ ప్రాజెక్టు పనులను రెండు దశల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2027 డిసెంబర్ నాటికి మొదటి దశ పనులు, 2028 డిసెంబర్ నాటికి మొత్తం ప్రాజెక్టును పూర్తి చేయాలని రైల్వే శాఖ ప్రణాళిక రూపొందించింది. తాజాగా ఆధునికీకరణ ప్రాజెక్టుకు సంబంధించిన కొత్త డిజైన్‌ను కూడా ప్రదర్శించారు. విశాఖపట్నం ఎంపీ శ్రీభరత్ రైల్వే స్టేషన్‌లో జరుగుతున్న పనులను పరిశీలించి, ఇంజినీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్లతో సమీక్షించారు.

ఈ సందర్భంగా ఎంపీ శ్రీభరత్ మాట్లాడుతూ.. విశాఖపట్నం రైల్వే స్టేషన్‌ను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ఆధునికీకరణ పనులు ప్రస్తుతం వేగంగా కొనసాగుతున్నాయని, కోర్టు కేసుల కారణంగా ప్రాజెక్టు పనులు ఏడాది ఆలస్యమయ్యాయని వివరించారు. విశాఖ రైల్వే స్టేషన్ దేశంలోనే అత్యుత్తమ స్టేషన్లలో ఒకటిగా నిలవాలన్నదే లక్ష్యమని పేర్కొన్నారు.

ప్రయాణికుల భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని అదనపు రైల్వే లైన్లు, ప్లాట్‌ఫారాలను నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఈ విస్తరణతో సుమారు 96 శాతం రైళ్లు నిర్ణీత సమయానికే స్టేషన్‌కు చేరుకునే అవకాశం ఉంటుందని, విశాఖ శివార్లలో రైళ్లు వేచి ఉండాల్సిన పరిస్థితి తగ్గుతుందని చెప్పారు.

స్టేషన్ ప్రాంగణంలో సోలార్ విద్యుత్ వ్యవస్థ, రైన్ వాటర్ హార్వెస్టింగ్, పార్కింగ్ సదుపాయాలను ఏర్పాటు చేయనున్నట్లు ఎంపీ వెల్లడించారు. వర్షపు నీటి సంరక్షణతో పాటు మురుగునీటి శుద్ధి కేంద్రాలను కూడా నిర్మించాలని అధికారులకు సూచించినట్లు శ్రీభరత్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *