
అనంతపురం, నవంబర్ 19 శింగనమల మండల పరిషత్ అధ్యక్ష (ఎంపీపీ) ఎన్నిక నేపథ్యంలో పోలీసులు ఆంక్షలు విధించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు.
గురువారం శింగనమల మండలంలో జరగనున్న ఎంపీపీ ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించేందుకు అనంతపురం నుంచి ఆయన బయలుదేరారు. అయితే మార్గమధ్యంలో పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. శింగనమలకు వెళ్లేందుకు అనుమతించకుండా గృహ నిర్బంధంలో ఉంచారు.
శింగనమల మండలంలో వైఎస్సార్సీపీ, తెలుగుదేశం పార్టీకి చెరో ఆరు ఎంపీటీసీ స్థానాలు దక్కాయి. దీంతో ఎంపీపీ పీఠం ఎవరికి దక్కుతుందనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో ఎన్నికల సరళిని పరిశీలించేందుకు వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డిని పోలీసులు అడ్డుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
