Vijaypat Singhania Death: ప్రముఖ పారిశ్రామిక వేత్త, రేమండ్ గ్రూప్ మాజీ చైర్మన్ విజయ్‌పత్ సింఘానియా ఇక లేరు. వయోభారంతో పాటు అనారోగ్య సమస్యలతో కొంతకాలంగా బాధపడుతున్న ఆయన.. శనివారం తుదిశ్వాస విడిచారు. దాదాపు రెండు దశాబ్దాల పాటు సింఘానియా రేమండ్ గ్రూప్‌కు చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా సేవలందించారు. తన నాయకత్వంలో సంస్థను అత్యున్నత స్థాయికి తీసుకెళ్లారు.

Vijaypat Singhania Raymond Group: భారతదేశానికి చెందిన అగ్రగామి వ్యాపారవేత్తల్లో ఒకరైన రేమండ్ గ్రూప్ మాజీ చైర్మన్, ఎండీ విజయ్‌పత్ సింఘానియా (87) కన్నుమూశారు. కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్న ఆయన.. శనివారం ముంబైలోని తన నివాసంలో మృతి చెందారు. ఆయన మరణ వార్తను కుమారుడు, రేమండ్ గ్రూప్ ప్రస్తుత చైర్మన్ గౌతమ్ సింఘానియా సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’ (ట్విట్టర్) ద్వారా ప్రకటించారు.

విజయ్‌పత్ సింఘానియా కాలంలో రేమండ్ గ్రూప్ విశేష అభివృద్ధి సాధించింది. చిన్న స్థాయి సంస్థగా ప్రారంభమైన కంపెనీని దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన బ్రాండ్‌గా తీర్చిదిద్దడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. 1980 నుంచి 2015 వరకు ఆయన సంస్థకు చైర్మన్‌గా కొనసాగారు.

మెన్స్ ఫ్యాషన్ రంగంలో రేమండ్‌ను అగ్రస్థానంలో నిలిపిన వ్యక్తిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. మొదట ఉలెన్ దుప్పట్లు తయారు చేసే సంస్థగా ఉన్న రేమండ్‌ను ఆధునిక టెక్స్‌టైల్ దిగ్గజంగా మార్చి, అంతర్జాతీయ ప్రమాణాలతో సూటింగ్ మరియు షర్టింగ్ బ్రాండ్‌గా అభివృద్ధి చేశారు. సామాన్యులకు సూట్ సంస్కృతిని చేరువ చేశారనే పేరు కూడా ఆయనకే దక్కింది.

టెక్స్‌టైల్ రంగానికే పరిమితం కాకుండా, ‘పార్క్ ఎవెన్యూ’ వంటి కొత్త బ్రాండ్లను కూడా ప్రారంభించారు. రేమండ్ ప్రసిద్ధ ట్యాగ్‌లైన్ ‘ది కంప్లీట్ మ్యాన్‌’ వెనుక ఉన్న ఆలోచన ఆయనదే. అందుకే ఆయనను కూడా అదే పేరుతో గుర్తిస్తుంటారు.