
ముంబయి: విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడిదారులకు (ఎఫ్‌పీఐ) మరింత వెసులుబాటు కల్పించే దిశగా మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ కీలక చర్యలకు సిద్ధమవుతోంది. ఎఫ్‌పీఐలపై ప్రస్తుతం అమల్లో ఉన్న కొన్ని నిబంధనలను సడలించే ప్రతిపాదనలతో త్వరలోనే చర్చాపత్రాన్ని విడుదల చేయనుంది. ఇతర దేశాల్లో అమల్లో లేని, భారత్‌లో మాత్రమే ఉన్న కొన్ని నిబంధనలను తొలగించాలని భావిస్తున్నట్లు సెబీ ఛైర్మన్ తుహిన్ కాంత పాండే శుక్రవారం వెల్లడించారు. ఈ మార్పులతో పెట్టుబడిదారులపై నిబంధనల భారం తగ్గడంతో పాటు, అంతర్జాతీయ పెట్టుబడులను మరింతగా ఆకర్షించే అవకాశం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఐదు రోజుల్లోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ
భారత మార్కెట్లలో పెట్టుబడులు పెట్టేందుకు ఎఫ్‌పీఐలు అవసరమైన రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయడానికి ప్రస్తుతం పడుతున్న సమయాన్ని ఐదు రోజులకు తగ్గించేలా సెబీ కసరత్తు చేస్తోందని పాండే తెలిపారు. స్వాగత్-ఎఫ్ఏ ఫ్రేమ్‌వర్క్ కింద నమోదైన కొంతమంది పెట్టుబడిదారులకు ఇప్పటికే ఈ సదుపాయం అందుబాటులో ఉంది. ప్రస్తుతం దాదాపు 17 శాతం మంది, అంటే 740 మంది ఎఫ్‌పీఐలు ఈ విధానంలో రిజిస్టర్ అయ్యారు.
డిజిటల్ సేవలకు మరింత ప్రాధాన్యం
ఎఫ్‌పీఐలకు సంబంధించిన పవర్ ఆఫ్ అటార్నీ పత్రాలను డిజిటలీకరించనున్నట్లు సెబీ ఛైర్మన్ వెల్లడించారు. కొత్త సెటిల్‌మెంట్ విధానంలో నిధుల లావాదేవీలకు అయ్యే ఖర్చులను కూడా తగ్గించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు.
డిసెంబర్ 1 నుంచి కేవైసీ సమీక్షకు సంబంధించిన గడువుల్లోనూ మార్పులు అమల్లోకి రానున్నాయి. ప్రస్తుతం ఒకటి, మూడేళ్లుగా ఉన్న సమీక్ష వ్యవధిని సంబంధిత ఎఫ్‌పీఐల వర్గాలను బట్టి రెండేళ్లు, ఎనిమిదేళ్లకు పెంచనున్నారు. ఇప్పటికే ప్రవాస భారతీయులు (ఎన్‌ఆర్‌ఐ), విదేశీ పౌరసత్వం కలిగిన భారతీయులు (ఓసీఐ), విదేశీ పౌరుల కోసం డిజిటల్ ఆన్‌బోర్డింగ్ ప్రక్రియను సరళీకరించారు. అర్హత కలిగిన పెట్టుబడిదారులు భారత్‌కు రాకుండానే కేవైసీ, ఈ-కేవైసీ ప్రక్రియలను పూర్తి చేసుకునే అవకాశం కల్పించారు.
చిన్న, మధ్య తరహా సంస్థలకు ప్రోత్సాహం
దేశీయ స్టాక్ మార్కెట్లలో చిన్న, మధ్య తరహా సంస్థల భాగస్వామ్యాన్ని పెంచడంపైనా సెబీ దృష్టి సారించింది. రాబోయే కొన్ని సంవత్సరాల్లో ఈ విభాగాల నుంచి కనీసం 2,000 కంపెనీలను స్టాక్ మార్కెట్లలో లిస్ట్ చేయాలనే లక్ష్యాన్ని మార్కెట్ పెట్టుకుందని పాండే వెల్లడించారు. ఈ చర్యలతో పెట్టుబడుల ప్రక్రియ సులభతరం కావడంతో పాటు, దేశీయ క్యాపిటల్ మార్కెట్ల విస్తరణకు మరింత ఊతం లభించనుంది.
