కందిపప్పు, పెసరపప్పు రెండూ ప్రోటీన్‌తో పాటు పలు పోషకాలను అందించే ముఖ్యమైన పప్పుధాన్యాలే. అయితే, వీటి పోషక విలువలు, జీర్ణమయ్యే విధానం, శరీరంపై ప్రభావంలో కొంత తేడా ఉంటుంది. కొందరికి కందిపప్పు తిన్నప్పుడు గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలు ఎదురవుతే.. మరికొందరికి పెసరపప్పు తిన్న తర్వాత త్వరగా ఆకలి అనిపించవచ్చు. ముఖ్యంగా బరువు నియంత్రించుకోవాలనుకునేవారు లేదా జీర్ణ సమస్యలు ఉన్నవారు తమ ఆహారంలో ఏ పప్పును ఎంత మోతాదులో తీసుకోవాలో తెలుసుకోవడం ముఖ్యం. మరి కందిపప్పు, పెసరపప్పులో పోషకాల పరంగా ఏది మెరుగైన ఎంపిక? ఎవరికి ఏది సరిపోతుందో తెలుసుకుందాం.

కందిపప్పు, పెసరపప్పు.. రెండూ భారతీయుల రోజువారీ ఆహారంలో ముఖ్యమైన పప్పుధాన్యాలే. పప్పుచారు, సాంబారు, ముద్దపప్పు, కిచిడీ వంటి వంటకాల రూపంలో ఇవి తరచూ మన భోజనంలో భాగమవుతుంటాయి. అయితే ఈ రెండింటిలో ఏది ఆరోగ్యానికి మంచిది? జీర్ణక్రియకు ఏది సులభం? అనే సందేహం చాలామందికి ఉంటుంది. వాస్తవానికి రెండింటిలోనూ ప్రొటీన్, ఫైబర్, విటమిన్లు, మినరల్స్ వంటి పోషకాలు లభిస్తాయి. అయితే వాటి పోషక విలువలు, జీర్ణక్రియపై ప్రభావం కొంత భిన్నంగా ఉంటుంది.
తేలికగా జీర్ణమయ్యే పెసరపప్పు
పెసరపప్పు సాధారణంగా తేలికగా జీర్ణమయ్యే పప్పుగా పరిగణిస్తారు. ఇందులో ప్లాంట్ ప్రొటీన్, ఫైబర్, ఫోలేట్, ఐరన్ వంటి పోషకాలు లభిస్తాయి. జీర్ణక్రియ సున్నితంగా ఉన్నవారు లేదా తేలికపాటి ఆహారం తీసుకోవాలనుకునేవారు పెసరపప్పుతో చేసిన కిచిడీ, పప్పు వంటి వంటకాలను ఎంచుకోవచ్చు. అయితే ప్రతి ఒక్కరి జీర్ణవ్యవస్థ ఒకేలా స్పందించదు.
కడుపు నిండేలా చేసే కందిపప్పు
కందిపప్పు కూడా ప్రొటీన్, ఫైబర్, ఫోలేట్, ఐరన్ వంటి పోషకాలకు మంచి వనరు. దీన్ని భోజనంలో చేర్చుకోవడం వల్ల ఎక్కువసేపు కడుపు నిండిన భావన ఉండేందుకు సహాయపడొచ్చు. అయితే కొందరికి కందిపప్పు వంటి పప్పుధాన్యాలు గ్యాస్, కడుపుబ్బరం వంటి ఇబ్బందులను కలిగించవచ్చు. పప్పును బాగా నానబెట్టి, పూర్తిగా ఉడికించి తీసుకోవడం జీర్ణక్రియకు కొంత అనుకూలంగా ఉంటుంది.
మరి ఏది బెస్ట్?
జీర్ణక్రియ పరంగా చాలామందికి పెసరపప్పు తేలికగా అనిపించవచ్చు. మరోవైపు కందిపప్పు కూడా సమతుల్య ఆహారంలో ముఖ్యమైన భాగమే. బరువు తగ్గే సమయంలో కూడా ఏదో ఒక పప్పునే ఎంచుకోవాల్సిన అవసరం లేదు. తీసుకునే పరిమాణం, మొత్తం ఆహారం, వంట విధానం, వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితి వంటి అంశాలు కూడా ముఖ్యమే.
అందుకే కందిపప్పు, పెసరపప్పులను వారంలో మారుస్తూ తీసుకోవడం ద్వారా ఆహారంలో వైవిధ్యాన్ని కొనసాగించవచ్చు. అయితే గ్యాస్, ఉబ్బరం లేదా ఇతర జీర్ణ సమస్యలు తరచుగా ఉంటే వ్యక్తిగత ఆహార అవసరాలకు అనుగుణంగా డైటీషియన్ లేదా వైద్యుడి సలహా తీసుకోవడం మంచిది.
