మార్కాపురం జిల్లా ప్రజల ఎన్నో ఏళ్ల కల సాకారమైంది. శ్రీ పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్‌ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించి జాతికి అంకితం చేశారు.

పెద్ద దోర్నాల మండలంలోని గంటవానిపల్లి హెడ్‌ రెగ్యులేటర్‌ వద్ద కృష్ణమ్మకు జలహారతి ఇచ్చిన సీఎం చంద్రబాబు, అనంతరం గేట్లు ఎత్తి కృష్ణా జలాలను నల్లమల సాగర్‌ జలాశయంలోకి విడుదల చేశారు. ప్రాజెక్ట్‌ శిలాఫలకాన్ని కూడా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి నిమ్మల రామానాయుడు, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు.

వెలిగొండ ప్రాజెక్ట్‌కు 1996లో చంద్రబాబు నాయుడే శంకుస్థాపన చేయగా, 2026లో ఆయన చేతుల మీదుగానే ప్రారంభం కావడం విశేషం. ప్రాజెక్ట్‌ను ప్రారంభించిన, పూర్తి చేసిన ముఖ్యమంత్రిగా చంద్రబాబు చరిత్రలో నిలిచారని స్థానికులు పేర్కొంటున్నారు.

వెలిగొండ మొదటి దశ ద్వారా 1.19 లక్షల ఎకరాలకు సాగునీరు, 4 లక్షల మందికి తాగునీరు అందనుంది. మొత్తంగా ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు, వైఎస్సార్‌ కడప జిల్లాల్లో 4.473 లక్షల ఎకరాలకు సాగునీరు, 23 లక్షల మందికి తాగునీరు అందే అవకాశం ఉంది.

శ్రీశైలం జలాలను వెలిగొండ ద్వారా నల్లమల సాగర్‌కు తరలించి, అక్కడి నుంచి మూడు కాల్వల ద్వారా ఆయకట్టుకు నీరందించనున్నారు. వెలిగొండ ప్రాజెక్ట్‌తో కరువు ప్రాంతంగా పేరున్న పశ్చిమ ప్రకాశం, మార్కాపురం ప్రాంతాల్లో సాగు, తాగునీటి సమస్యలు తీరడంతో పాటు రైతుల జీవితాల్లో కొత్త ఆశలు చిగురించనున్నాయి.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *