టీమిండియా మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ తన క్రికెట్ ప్రయాణంలోని మరిచిపోలేని జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నాడు. భారత జట్టులో తొలిసారి చోటు దక్కిన సందర్భం నుంచి ముంబైలోని వాంఖడే స్టేడియంలో తన పేరుతో ప్రత్యేక స్టాండ్ ఏర్పాటు చేసిన రోజు వరకు.. తన తల్లిదండ్రులు గర్వపడిన ఎన్నో క్షణాల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ‘ఫ్యామిలీ ఫుల్ హౌస్ విత్ రోహిత్ శర్మ’ కార్యక్రమం తాజా ఎపిసోడ్‌లో తన అనుభవాలను అభిమానులతో పంచుకున్నాడు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న జాస్మీ అనే కంటెస్టెంట్.. తన కుటుంబం రోహిత్‌ను కలవబోతున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పింది. ఈ సందర్భంగా తన జీవితంలో తల్లిదండ్రులు అత్యంత గర్వంగా భావించిన సందర్భం ఏదని రోహిత్‌ను ప్రశ్నించింది. దీనికి హిట్‌మ్యాన్ తన అంతర్జాతీయ కెరీర్‌లో తొలి మలుపును గుర్తుచేసుకున్నాడు.

ఫోన్ కాల్ కోసం గంటల తరబడి ఎదురుచూపులు

తొలిసారి భారత జట్టుకు ఎంపికైన రోజు తనకు ఇప్పటికీ స్పష్టంగా గుర్తుందని రోహిత్ తెలిపాడు. ఆ సమయంలో తాను బెంగళూరులో ఉన్నానని, అదే రోజు జట్టు ఎంపిక జరగనుందని ముందే తెలుసని చెప్పాడు. ప్రాక్టీస్ ముగించుకుని హోటల్‌కు చేరుకున్న తర్వాత తన దృష్టంతా ఫోన్‌పైనే ఉండేదని వివరించాడు.

జట్టులో చోటు దక్కిందనే సమాచారం ఎప్పుడు వస్తుందా అని ఎంతో ఆతృతగా ఎదురుచూశానని తెలిపాడు. సాధారణంగా ఫోన్ కాల్స్ రాకపోతే జట్టుకు ఎంపిక కాలేదని భావించేవాడినని చెప్పాడు. మధ్యాహ్నం సమయంలో నిద్ర కూడా పట్టలేదని, దాదాపు గంట లేదా రెండు గంటల పాటు ఫోన్ పక్కనే కూర్చున్నానని గుర్తుచేసుకున్నాడు.

చివరకు సాయంత్రం ఐదు గంటల సమయంలో ఫోన్ మోగిందని, రింగ్ పూర్తయ్యేలోపే కాల్ అందుకున్నానని చెప్పాడు. బీసీసీఐ నుంచి వచ్చిన ఆ ఫోన్ కాల్‌లో టీమిండియాకు ఎంపికైనట్లు సమాచారం అందిందని వెల్లడించాడు.

ఆ వార్త వినగానే ఆనందంతో ఎగిరి గంతేశానని రోహిత్ చెప్పాడు. బెడ్‌పై నుంచి ఒక్కసారిగా దూకడంతో గాయమయ్యే పరిస్థితి వచ్చిందని సరదాగా గుర్తుచేసుకున్నాడు. ఆ సమయంలో తన ఆనందాన్ని ఎలా వ్యక్తం చేయాలో కూడా అర్థం కాలేదన్నాడు. కొంతసేపు ఇది నిజమా, కలా అని తనను తాను ప్రశ్నించుకున్నానని, ఆ తర్వాత తల్లిదండ్రులకు ఫోన్ చేసి శుభవార్త చెప్పానని వివరించాడు. వారు ఎంతో సంతోషించారని పేర్కొన్నాడు.

వాంఖడే స్టాండ్ ఏర్పాటు.. భావోద్వేగానికి గురైన తండ్రి

తన పేరుతో వాంఖడే స్టేడియంలో ప్రత్యేక స్టాండ్ ఏర్పాటు చేయడం కూడా తల్లిదండ్రులకు అత్యంత గర్వకారణమైన సందర్భమని రోహిత్ వెల్లడించాడు. చిన్నప్పటి నుంచి అదే మైదానంలో ఆడాలని కలలు కన్నానని, అలాంటి స్టేడియంలో తన పేరుతో స్టాండ్ ఏర్పాటు చేస్తారని ఎప్పుడూ ఊహించలేదని చెప్పాడు.

ఈ కార్యక్రమానికి తల్లిదండ్రులు కూడా హాజరయ్యారని, ఆ రోజు కుటుంబ సభ్యులంతా భావోద్వేగానికి గురయ్యారని తెలిపాడు. ముఖ్యంగా తన తండ్రి ఆ కార్యక్రమం జరిగిన రోజంతా తనతో ఒక్క మాట కూడా మాట్లాడలేదని గుర్తుచేసుకున్నాడు. ఆయన అంతగా భావోద్వేగానికి లోనయ్యారని, మరుసటి రోజు మాత్రమే తన మనసులోని భావాలను బయటపెట్టారని వివరించాడు.

ప్రపంచకప్ విజయం కూడా మరిచిపోలేని జ్ఞాపకం

2024లో టీ20 ప్రపంచకప్‌ను భారత్ గెలిచిన తర్వాత వాంఖడే స్టేడియానికి తిరిగి వచ్చిన సందర్భాన్ని కూడా రోహిత్ గుర్తుచేసుకున్నాడు. ఆ సమయంలో తన తల్లిని కలిశానని, ఆమె ఎంతో ఆనందంగా కనిపించారని చెప్పాడు. భారత జట్టుకు తొలి ఎంపిక, వాంఖడేలో తన పేరుతో స్టాండ్ ఏర్పాటు, ప్రపంచకప్ విజయానంతరం సొంత నగరానికి తిరిగి రావడం.. ఈ మూడు సందర్భాలు తన తల్లిదండ్రులకు ఎప్పటికీ ప్రత్యేకమైనవని పేర్కొన్నాడు.

శ్రీలంక సిరీస్‌పై రోహిత్ దృష్టి

ఇదిలా ఉంటే, ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో రోహిత్ శర్మ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. నాలుగు ఇన్నింగ్స్‌లలో కలిపి కేవలం 30 పరుగులే చేశాడు. రెండుసార్లు డకౌట్‌గా వెనుదిరిగాడు. ఇప్పుడు డిసెంబర్ 13 నుంచి స్వదేశంలో శ్రీలంకతో జరగనున్న మూడు వన్డేల సిరీస్‌లో మళ్లీ తన బ్యాట్‌కు పనిచెప్పాలని అభిమానులు ఆశిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *