ప్రపంచ క్రికెట్‌లో సంపన్న బోర్డుల్లో ఒకటిగా పేరొందిన ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు (ECB) ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొనే పరిస్థితి కనిపిస్తోంది. 2027లో భారత జట్టు ఇంగ్లాండ్‌లో పర్యటించకపోవడం, అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) నుంచి వచ్చే ఆదాయంలో కోత పడే అవకాశాలు ఉండటంతో ఈసీబీకి భారీ నష్టం వాటిల్లనుందని సమాచారం. ఈ రెండు పరిణామాల కారణంగా బోర్డుకు సుమారు 50 మిలియన్ పౌండ్లు (దాదాపు రూ.627 కోట్లు) నష్టపోయే ప్రమాదం ఉందని ది గార్డియన్ తన కథనంలో పేర్కొంది.

టీమిండియా పర్యటన లేక ఆదాయానికి గండి

ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఆదాయంలో అంతర్జాతీయ జట్ల పర్యటనలు, ముఖ్యంగా భారత జట్టు పర్యటనలకు కీలక స్థానం ఉంది. టీమిండియా ఆడే మ్యాచ్‌లకు భారీ టీవీ వ్యూయర్‌షిప్ ఉండటంతో ప్రసార హక్కులు, ప్రకటనలు, వాణిజ్య ఒప్పందాల ద్వారా ఈసీబీకి గణనీయమైన ఆదాయం సమకూరుతుంది. అయితే 2027లో భారత జట్టు ఇంగ్లాండ్‌లో పర్యటించే షెడ్యూల్ లేకపోవడంతో బోర్డు ఆదాయంపై ప్రతికూల ప్రభావం పడనుంది.

ఐసీసీ రెవెన్యూలోనూ కోత?

ఈసీబీ ఆర్థిక పరిస్థితిని ప్రభావితం చేయనున్న మరో అంశం ఐసీసీ ప్రతిపాదిస్తున్న ఆదాయ పంపిణీ మార్పు. 2027లో సభ్య దేశాలకు అందించాల్సిన బ్రాడ్‌కాస్ట్ ఆదాయంలో కొంత మొత్తాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని ఐసీసీ భావిస్తున్నట్లు సమాచారం. ఈ నిర్ణయం అమలైతే ఇంగ్లాండ్‌తో పాటు మొత్తం 12 టెస్ట్ హోదా కలిగిన క్రికెట్ బోర్డులపై ప్రభావం పడనుంది.

అయితే ఈసీబీ తమకు ఎదురయ్యే నష్టాన్ని తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఐసీసీతో చర్చలు జరిపి ఆదాయ కోత ప్రభావాన్ని పరిమితం చేయాలని చూస్తోంది. ఈ మేరకు నష్టాన్ని 50 మిలియన్ పౌండ్ల నుంచి 35 మిలియన్ పౌండ్లకు (సుమారు రూ.439 కోట్లు) తగ్గించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు స్పాన్సర్‌షిప్‌లు, ఇతర వాణిజ్య కార్యక్రమాల ద్వారా అదనపు ఆదాయం సమకూర్చుకోవచ్చని ఆశిస్తోంది.

ఐసీసీ డబ్బును ఎందుకు నిలిపివేస్తోంది?

2028 నుంచి అమల్లోకి రానున్న కొత్త ప్రసార హక్కుల ఒప్పందం విలువ తగ్గే అవకాశం ఉందని ఐసీసీ అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో సభ్య దేశాల ఆదాయానికి ఇబ్బందులు ఎదురుకాకుండా ముందుగానే కొంత మొత్తాన్ని నిల్వ ఉంచుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుత రెవెన్యూ సైకిల్‌కు 2027 చివరి సంవత్సరం. అదే ఏడాది వన్డే ప్రపంచకప్ జరగనుండటంతో సభ్య దేశాలకు భారీ మొత్తంలో ఆదాయం అందాల్సి ఉంది. అయితే ఐసీసీ ప్రతిపాదిస్తున్న కోత కారణంగా బోర్డుల ఆర్థిక ప్రణాళికలు ప్రభావితమయ్యే అవకాశం ఉంది.

కౌంటీ క్రికెట్‌పైనా ప్రభావం

ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఆందోళనకు మరో ప్రధాన కారణం భారత మార్కెట్‌పై ఉన్న ఆధారపడటమే. ప్రస్తుతం సోనీ పిక్చర్స్‌తో ఈసీబీకి ఆరేళ్ల కాలానికి 185 మిలియన్ పౌండ్ల (సుమారు రూ.2,323 కోట్లు) విలువైన ప్రసార ఒప్పందం ఉంది. ఈ ఒప్పందం 2028లో ముగియనుంది. ఆ తర్వాత కుదుర్చుకునే కొత్త ఒప్పందం విలువ తగ్గే అవకాశం ఉండటంతో బోర్డు ఆదాయంపై దీర్ఘకాలిక ప్రభావం పడవచ్చని అంచనా.

ఈ పరిణామాలు ఇంగ్లాండ్ దేశవాళీ క్రికెట్ వ్యవస్థపైనా ప్రభావం చూపనున్నాయి. ఈసీబీ నుంచి ఆర్థిక సహాయం పొందే కౌంటీ జట్లకు నిధుల కేటాయింపులు తగ్గే ప్రమాదం ఉంది. ఇప్పటికే అక్కడి 18 కౌంటీ జట్లలో 10 జట్లు నష్టాల్లో కొనసాగుతున్నట్లు సమాచారం. వీటిలో చాలా జట్లు ఈసీబీ అందించే ఆర్థిక సహాయంపైనే ఆధారపడుతున్నాయి.

2025లో ఈసీబీ 12.6 మిలియన్ పౌండ్ల లాభాన్ని నమోదు చేసినప్పటికీ.. 2027లో మాత్రం పరిస్థితులు ప్రతికూలంగా మారవచ్చని ముందుగానే అంచనా వేసింది. తాజా లెక్కల ప్రకారం నష్టాల తీవ్రత మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. మరి ఐసీసీతో చర్చలు, కొత్త స్పాన్సర్‌షిప్ ఒప్పందాల ద్వారా ఈసీబీ ఎంతవరకు నష్టాన్ని తగ్గించుకుంటుందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *