Trainee IPS Uday Krishna Reddy Updates: హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లోని జాతీయ పోలీస్‌ అకాడమీలో తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్‌పై లైంగిక వేధింపులు, దాడి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసు మరో మలుపు తిరిగింది. తనపై వచ్చిన లైంగిక ఆరోపణల నేపధ్యంలో ఆయన హైదరాబాద్‌లో ఆత్మహత్యాయత్నం చేశారు. అపస్మారక స్థితిలో ఉన్న ఆయనను కుటుంబ సభ్యులు ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఉదయ్‌ కృష్ణారెడ్డి ICUలో చికిత్స పొందుతున్నారు.

రాజేంద్రనగర్‌లోని జాతీయ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న ఉదయ్ కృష్ణారెడ్డి, తనతోపాటు శిక్షణ పొందుతున్న తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్‌ను గత కొంతకాలంగా లైంగికంగా వేధిస్తున్నట్లు అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఆమెకు సంబంధించిన ప్రైవేట్ వీడియోలు కృష్ణారెడ్డి రికార్డు చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ వీడియోలను ఆమె భర్తకు పంపిస్తానని బెదిరించడంతో పాటు, మెడపై కత్తిపెట్టి దాడి చేశాడనే తీవ్ర ఆరోపణలను చేసింది. దీంతో కృష్ణారెడ్డిపై అత్తాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఈ ఘటనపై ప్రివిలేజ్ కమిటీ ప్రాథమిక చేపట్టగా.. ఆందోళనకు గురైన కృష్ణారెడ్డి తాను ఏ పాపం చేయలేదంటూ సోమవారం ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపింది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన ట్రైనీ IPS ఉదయ్‌ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం కేసులో కీలక ట్విస్ట్‌ వెలుగులోకి వచ్చింది. సోమవారం ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం చేసి, ఆసుపత్రి పాలైనట్లు రోజంతా నడిచిన హైడ్రామాలో డాక్టర్లు విస్తుపోయే వాస్తవాలు వెల్లడించారు. అసలు అదంతా నాటకమని, సానుభూతి పొందడం కోసమే ఉదయ్‌ కృష్ణ ఇలా చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.

ఏది నిజం..? అసలెవరు బాధితులు?

ఆయన మంచం పక్కనే మద్యం సీసా, శానిటైజర్‌ ఉండటంతో ఆత్మహత్యకు యత్నించినట్లు భావించిన అతని సోదరుడు ప్రణయ్‌ కృష్ణారెడ్డి సోమవారం ఉదయం 9.30 గంటలకు ఎస్సార్‌నగర్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. వెంటనే వైద్యులు చికిత్స ప్రారంభించి, అతని రక్త నమూనాలను పరీక్షకు పంపారు. రక్తంలో ఎలాంటి విషపదార్థం లేదని నివేదిక రావడంతో అంతా విస్తుపోయారు. తనపై వేధింపుల కేసు నమోదు కావడంతో బాధ, అవమానం భరించలేక ఫూటుగా మద్యం సేవించి, ఆ మత్తులోనే సూసైడ్‌నోట్‌ కూడా రాసినట్టు పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు అసలు జాతీయ పోలీస్‌ అకాడమీ (NPA)లో ఏం జరిగిందనే దానిపై అధికారులు అంతర్గత కమిటీ ఏర్పాటు చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా అత్తాపూర్‌ పోలీసులు జాతీయ పోలీసు అకాడమీ అధికారులతో భేటీ అయ్యారు. సీసీటీవీ కెమెరాల ఫుటేజ్‌ సేకరించి, నివేదిక ఆధారంగా ఉదయ్‌ కృష్ణారెడ్డిపై తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం. మరోవైపు ఆరోపణలు చేసిన ట్రైనీ IPS మహిళ వీరి స్నేహం గురించిన వాస్తవాలు ఇంతవరకు వెల్లడించ లేదు. దీంతో అసలేది నిజం అనే సందిగ్ధం నెలకొంది.

కాగా ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశంజిల్లాకు చెందిన ఉదయ్ కృష్ణారెడ్డి గతంలో కానిస్టేబుల్‌గా పనిచేశాడు. ఆ సమయంలో ఓ CI తనను అవమానకరంగా మాట్లాడిన నేపధ్యంలో ఉద్యోగానికి రాజీనామా చేసి UPSC పరీక్షలు రాసి IPSకు సెలెక్ట్‌ అయ్యాడు. అవమానకర పరిస్థితులను ఎదుర్కొని ఆ తరువాత పట్టుదలతో ఎదిగి ఐపీఎస్ సాధించడంతో ఆయన జీవితం పలువురికి స్పూర్తిదాయకంగా నిలిచింది. అయితే తాజాగా ఆయనపై తోటి మహిళా IPSపై లైంగిక వేధింపుల కేసు నమోదు కావడంతో పోలీస్ అకాడమీ నుంచి తాత్కాలికంగా సస్పెన్షన్‌కు గురయ్యారు. కష్టపడి ఉద్యోగం పొంది, మరో రెండు నెలల్లో పోస్టింగ్‌ వస్తుందనుకుంటున్న సమయంలో ఈ విధమైన ఆరోపణలు రావడం చర్చకు దారితీసింది.

నా ఆత్మహత్యకు ఆ నలుగురే కారణం: ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డి

తనపై ఆరోపణలు చేసిన సదరు మహిళా ట్రైనీ IPSతో ఏడాదిగా రిలేషన్‌లో ఉన్నట్లు, ఈ క్రమంలో ఆమెతో వాట్సప్‌ చాటింగ్‌ చేసిన ఆధారాలు, తామిద్దరం కలిసి ఉన్న వీడియోలు ఆమె భర్తకు పంపినట్లు తెలిపారు. ఆ కక్ష్యతోనే ఆమె తనపై నిరాధార ఆరోపణలు చేసినట్లు తన సూసైడ్‌ లేఖలో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన సాక్ష్యాలన్నీ తన ఫోన్‌లో ఉన్నాయని తెలిపారు. దీంతో పోలీసులు ఆయన ఫోన్‌ను స్వాధీనం చేసుకుని కీలక సమాచారం వెలికితీసే పనిలో మునిగిపోయారు.