
రణవీర్ సింగ్ నటించిన తాజా యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని నమోదు చేస్తోంది. విడుదలైన మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 500 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఈ చిత్రం సంచలనం సృష్టించింది. ఫస్ట్ పార్ట్ సృష్టించిన రికార్డులను అధిగమిస్తూ, ఈ సీక్వెల్ కొత్త మైలురాళ్లు నెలకొల్పుతోంది. థ్రిల్లింగ్ యాక్షన్ సన్నివేశాలు, గ్రిప్పింగ్ స్పై ఎలిమెంట్స్, అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్టులతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తోంది.
దేశవ్యాప్తంగా థియేటర్లలో హౌస్‌ఫుల్ బోర్డులు కనిపిస్తుండగా, రణవీర్ కెరీర్లో ఇదే అతిపెద్ద హిట్‌గా నిలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. టాలీవుడ్ స్టార్ హీరోలు అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్ సహా పలువురు ప్రముఖులు కూడా చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. హిందీతో పాటు ఇతర భాషల్లోనూ ఈ సినిమాకు అంచనాలకు మించిన స్పందన లభిస్తోంది.
అయితే ఈ భారీ విజయోత్సాహం మధ్య ఒక ఆసక్తికర అంశం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. రణవీర్ భార్య దీపికా పదుకొణె ఈ సినిమాపై సోషల్ మీడియాలో స్పందించకపోవడంతో, నెటిజన్లు అనేక సందేహాలు వ్యక్తం చేశారు. గతంలో రణవీర్ చిన్న విజయాలకే వెంటనే స్పందించే దీపికా, ఈసారి మౌనం వహించడం చర్చకు దారితీసింది. అంతేకాకుండా, ముంబైలో జరిగిన స్పెషల్ స్క్రీనింగ్‌కు హాజరు కాకపోవడం, తర్వాత అత్తమామలతో మరో కార్యక్రమానికి వెళ్లడం వంటి విషయాలు పుకార్లకు బలం చేకూర్చాయి.
కానీ ఈ రూమర్లన్నింటికీ చెక్ పెడుతూ, ఆదివారం ముంబైలో ఈ జంట కలిసి లంచ్ డేట్‌కు వెళ్లింది. ఒక ప్రముఖ రెస్టారెంట్ వద్ద రణవీర్, దీపిక జంటగా కనిపించడంతో అభిమానులు భారీగా తరలివచ్చారు. రణవీర్ బయటకు రాగానే అభిమానులు “బబ్బర్ షేర్” అంటూ నినాదాలు చేస్తూ హోరెత్తించారు.
ఈ సందర్భంగా భర్తకు లభిస్తున్న ప్రేమాభిమానాలను చూసి దీపిక ఆనందంతో మురిసిపోయారు. సోషల్ మీడియాలో స్పందించకపోయినా, తన చిరునవ్వుతోనే రణవీర్ విజయంపై తన గర్వాన్ని వ్యక్తం చేశారు. ఈ దృశ్యాలు వైరల్ కావడంతో, గత కొద్ది రోజులుగా వస్తున్న మనస్పర్థల పుకార్లకు పూర్తిగా తెరపడింది.
మొత్తానికి, ‘ధురంధర్ 2’ విజయాన్ని కలిసి సెలబ్రేట్ చేసుకునేందుకు ఈ జంట బయటకు వచ్చినట్లు స్పష్టమవుతోంది.

