పూర్ణం బూరెలు తెలుగు రాష్ట్రాల సంప్రదాయ వంటకాల్లో ఎంతో ప్రత్యేకమైన తీపి వంటకం. పండుగలు, శుభకార్యాల్లో ముఖ్యంగా శ్రావణ మాసం, వరలక్ష్మి వ్రతం వంటి సందర్భాల్లో వీటిని తప్పకుండా తయారు చేస్తుంటారు. బయట పొర క్రిస్పీగా, లోపల తియ్యటి పూర్ణంతో ఉండే పూర్ణం బూరెలు చూస్తేనే నోరూరిస్తాయి. అయితే బూరెలు వేయించే సమయంలో పూర్ణం బయటకు రాకుండా, పొర పగలకుండా పర్ఫెక్ట్గా రావాలంటే కొన్ని ముఖ్యమైన చిట్కాలు పాటించాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

పూర్ణం బూరెలు క్రిస్పీగా, చక్కని ఆకృతిలో రావాలంటే పిండి తయారీ విధానం చాలా ముఖ్యం. ముందుగా ఒక కప్పు మినపగుళ్లు, రెండు కప్పుల రేషన్ బియ్యం లేదా సోనా మసూరి బియ్యం తీసుకోవాలి. వీటితో పాటు ఒక టేబుల్‌స్పూన్ పచ్చి శెనగపప్పు కూడా కలిపితే బయటి పొరకు మంచి రుచి, కమ్మదనం వస్తుంది. ఈ మూడింటినీ రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి, తగినన్ని నీళ్లు పోసి కనీసం 4–5 గంటలు నానబెట్టాలి. కావాలంటే రాత్రంతా కూడా నానబెట్టుకోవచ్చు.
నానిన తర్వాత నీటిని వంపేసి, మిక్సీ జార్లో వేసి చాలా తక్కువ నీటితో మెత్తగా, గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి. పిండి స్పూన్‌తో తీసి పోసినప్పుడు రిబ్బన్‌లా జారేలా ఉండాలి. ఈ పిండిని వెంటనే ఉపయోగించకుండా మూత పెట్టి కనీసం రెండు గంటలు పక్కన ఉంచాలి. ఇలా ఉంచడం వల్ల పిండి సహజంగా పులిసి, వంటసోడా అవసరం లేకుండానే బూరెలు చక్కగా పొంగడానికి సహాయపడుతుంది.
పిండి పులిసిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు, ఒక టీస్పూన్ చక్కెర వేసి బాగా కలపాలి. బూరెలు మరింత క్రిస్పీగా ఉండేందుకు వేయించే ముందు ఒక టేబుల్‌స్పూన్ పొడి బియ్యప్పిండిని కలపాలి. ఇది బయటి పొరకు మంచి కరకరలాడే టెక్స్చర్ ఇవ్వడంతో పాటు బూరెలు చిదిమిపోకుండా ఉండేందుకు సహాయపడుతుంది.
ఇక పూర్ణం కోసం ఒక కప్పు పచ్చి శెనగపప్పును కడిగి గంటసేపు నానబెట్టాలి. అనంతరం ఒకటిన్నర కప్పుల నీటితో ప్రెషర్ కుక్కర్లో మీడియం ఫ్లేమ్‌పై 3–4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. నీరు ఎక్కువగా మిగలకుండా చూసుకుని, పప్పును పూర్తిగా పేస్ట్‌లా కాకుండా కొద్దిగా పలుకులు ఉండేలా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. అందులో ఒక కప్పు తురిమిన బెల్లం వేసి కలిపి, లో-మీడియం ఫ్లేమ్‌పై పూర్ణం గట్టిపడే వరకు ఉడికించాలి. చివరగా ఒక టేబుల్‌స్పూన్ నెయ్యి, అర టీస్పూన్ యాలకుల పొడి వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి.
పూర్ణాన్ని త్వరగా చల్లార్చేందుకు పలుచగా పరచాలి. పూర్తిగా చల్లారిన తర్వాత చేతులకు కొద్దిగా నెయ్యి రాసుకుని మధ్యస్థ పరిమాణంలో ఉండలుగా చేసుకోవాలి. ఈ కొలతలతో సుమారు 12 పూర్ణం ఉండలు తయారవుతాయి.
ఇప్పుడు నూనెను బాగా వేడి చేసి, ఒక్కో పూర్ణం ఉండను పిండిలో పూర్తిగా ముంచి బయటకు తీసి నెమ్మదిగా నూనెలో వేయాలి. నేరుగా చేతులతో వేయడం అలవాటు లేనివారు స్పూన్ సహాయంతో నూనెలోకి జారవిడవచ్చు. నూనెలో వేసిన వెంటనే బూరెలను కదపకుండా సుమారు రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్‌పై వేయించాలి. అవి పైకి తేలిన తర్వాత నెమ్మదిగా తిప్పుతూ బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి.
బూరెలను ఎప్పుడూ హై ఫ్లేమ్‌పై వేయించకూడదు. అలా చేస్తే బయట త్వరగా రంగు వచ్చి లోపల సరిగ్గా ఉడకకపోవచ్చు. లో-మీడియం మంటపై నిదానంగా వేయిస్తే లోపల పూర్ణం మెత్తగా, బయట పొర కరకరలాడుతూ చక్కగా తయారవుతుంది. తయారైన పూర్ణం బూరెలను సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని నైవేద్యంగా సమర్పించుకోవచ్చు.
