
మార్కెట్ విలువ పరంగా భారత జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్ఎస్ఈ) మరో అరుదైన ఘనత సాధించింది. ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద స్టాక్ ఎక్స్ఛేంజీగా అవతరించింది. ఎన్ఎస్ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ 58.5 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.5.49 లక్షల కోట్లు) చేరడంతో ఈ గుర్తింపు దక్కింది. ఈ క్రమంలో హాంకాంగ్ ఎక్స్ఛేంజెస్ అండ్ క్లియరింగ్ (హెచ్కేఈఎక్స్), అమెరికాకు చెందిన నాస్డాక్ను వెనక్కి నెట్టింది.
లిస్టింగ్ తర్వాత షేరుకు భారీ డిమాండ్
ఈ ఏడాది సెప్టెంబర్ చివరి వారంలో ఎన్ఎస్ఈ షేర్లు స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్‌కు వచ్చాయి. లిస్టింగ్ అనంతరం కొంతకాలం తీవ్ర ఒడుదొడుకులు ఎదుర్కొన్నప్పటికీ.. ఈ నెలలో మాత్రం షేరు ధర పుంజుకుంది. సుమారు 25 శాతం పెరిగి రూ.2,251 వద్ద ఆల్‌టైమ్ గరిష్ఠాన్ని నమోదు చేసింది. శుక్రవారం ట్రేడింగ్‌లో రూ.2,220 వద్ద కొనసాగింది.
దేశీయ టాప్-10 కంపెనీల్లో చోటు
మార్కెట్ విలువ ఆధారంగా దేశంలోని అత్యంత విలువైన పది కంపెనీల జాబితాలోనూ ఎన్ఎస్ఈ స్థానం సంపాదించింది. రూ.5.49 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్‌తో ఎల్ఐసీ (రూ.5.18 లక్షల కోట్లు), కోటక్ మహీంద్రా బ్యాంక్ (రూ.5.13 లక్షల కోట్లు)లను అధిగమించి పదో స్థానానికి చేరింది.
బ్యాంకింగ్, ఐటీ, చమురు-గ్యాస్ రంగాలకు చెందిన దిగ్గజ సంస్థలతో పోటీపడుతూ.. క్యాపిటల్ మార్కెట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విభాగం నుంచి దేశంలో ఈ స్థాయి మార్కెట్ విలువను సాధించిన తొలి స్టాక్ ఎక్స్ఛేంజీగా ఎన్ఎస్ఈ నిలిచింది. భారత క్యాపిటల్ మార్కెట్ల అభివృద్ధిలో ఇది కీలక పరిణామంగా చెప్పవచ్చు.
