
టెక్నాలజీ దిగ్గజం యాపిల్ భారత్‌లోని ఐఫోన్, ఐప్యాడ్, మ్యాక్ వినియోగదారుల కోసం యాపిల్ మ్యాప్స్‌ను సరికొత్త ఫీచర్లతో అప్డేట్ చేసింది. భారతీయ రహదారులు, స్థానిక పరిస్థితులు, భాషలకు అనుగుణంగా పలు మార్పులు తీసుకొచ్చింది. మెరుగైన నావిగేషన్, హైరిజల్యూషన్ వీక్షణలు, 3డీ ల్యాండ్‌మార్క్‌లతో వినియోగదారులకు కొత్త అనుభూతిని అందించనుంది. గూగుల్ మ్యాప్స్‌కు ప్రత్యామ్నాయంగా నిలిచేలా దేశవ్యాప్తంగా రహదారులు, భవనాలు, పార్కులు, షాపింగ్ మాల్స్‌కు సంబంధించిన వివరాలను ఇందులో పొందుపరిచింది.
300కు పైగా ల్యాండ్‌మార్క్‌లు 3డీ రూపంలో
భారత్‌లోని ప్రముఖ చారిత్రక కట్టడాలు, ప్రభుత్వ భవనాలు, ప్రార్థనా మందిరాలు సహా 300కు పైగా ముఖ్యమైన ప్రదేశాలను త్రీడీ రూపంలో వీక్షించే అవకాశం కల్పించింది. హైరిజల్యూషన్ చిత్రాలు, సులభమైన ట్రాన్సిషన్లతో వీధులను 360 డిగ్రీల కోణంలో పరిశీలించవచ్చు. ఒక ప్రాంతానికి వెళ్లకముందే అక్కడి పరిసరాలను ముందుగానే చూసుకునే వెసులుబాటు ఉంటుంది. విదేశాల్లో ఉన్నవారు సైతం ఈ ఫీచర్ ద్వారా భారతీయ నగరాల వీధులను వర్చువల్‌గా సందర్శించవచ్చు.
స్థానిక గుర్తులతో వాయిస్ నావిగేషన్
భారత్‌లో చాలా ప్రాంతాల్లో రహదారులకు సంబంధించిన పేర్లు స్పష్టంగా ఉండకపోవడం, స్థానిక గుర్తుల ఆధారంగా ప్రయాణించడం సాధారణం. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని యాపిల్ ప్రత్యేక వాయిస్ నావిగేషన్‌ను తీసుకొచ్చింది. కేవలం కుడివైపు లేదా ఎడమవైపు తిరగాలని చెప్పకుండా.. పెట్రోల్ బంకు దాటిన తర్వాత కుడివైపు తిరగండి, తదుపరి సిగ్నల్ వద్ద ఎడమవైపు వెళ్లండి వంటి స్పష్టమైన సూచనలు అందిస్తుంది.
అలాగే మలుపులు, ఫ్లైఓవర్ల వద్ద ముందుగానే సరైన లేన్‌ను ఎంచుకునేందుకు లేన్ గైడెన్స్ సదుపాయాన్ని కూడా జోడించింది. దీనివల్ల తెలియని ప్రాంతాల్లో ప్రయాణించేవారికి మార్గాన్ని గుర్తించడం మరింత సులభమవుతుంది.
తెలుగుతో పాటు 11 భారతీయ భాషల్లో..
యాపిల్ మ్యాప్స్‌ను ఇంగ్లిష్, హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, మరాఠీ, బెంగాలీ, గుజరాతీ, పంజాబీ, ఒడియా, ఉర్దూ భాషల్లో ఉపయోగించుకోవచ్చు. స్థానిక భాషల్లో మ్యాప్స్‌ను వీక్షించే అవకాశం ఉండటంతో ప్రాంతీయ వినియోగదారులకు ప్రయోజనం కలగనుంది.
హైదరాబాద్ సహా 8 నగరాల్లో ప్రజా రవాణా వివరాలు
హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ముంబయి, కోల్‌కతా, పుణె, అహ్మదాబాద్ నగరాల్లో మెట్రో రైళ్లు, స్థానిక బస్సులు, రైల్వే ప్రయాణాలకు సంబంధించిన వివరాలను కూడా మ్యాప్స్ అందిస్తుంది. ప్రయాణ సమయాలు, రూట్ ప్లానింగ్ ద్వారా గమ్యస్థానానికి చేరుకునే మార్గాన్ని ముందుగానే ఎంచుకోవచ్చు.
ఏ యాపిల్ పరికరాల్లో పనిచేస్తుంది?
ఈ కొత్త ఫీచర్లు ఐఓఎస్ 27.2, ఐప్యాడ్ ఓఎస్ 27.2, వాచ్ ఓఎస్ 27.2, మ్యాక్ ఓఎస్ 27.2 లేదా ఆపై వెర్షన్లతో పనిచేసే యాపిల్ పరికరాల్లో అందుబాటులోకి వచ్చినట్లు సమాచారం.
