
భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని మచిలీపట్నంలో నిర్వహించిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జాతీయ జెండా దేశ ప్రజల ఐక్యతకు ప్రతీక అని, భవిష్యత్తుకు మార్గదర్శకమని పేర్కొన్నారు. దశాబ్దాల పోరాటం, తరాల ఉద్యమం, ఎందరో మహనీయుల బలిదానాల ఫలితంగా స్వతంత్ర భారతదేశం ఏర్పడిందని గుర్తుచేశారు.
జాతీయ జెండాను రూపొందించి దేశ ప్రజలను ఏకతాటిపైకి తీసుకొచ్చిన పింగళి వెంకయ్య జన్మించిన నేలపై జీవిస్తున్నందుకు ప్రతి ఒక్కరూ గర్వపడాలని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఆయన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు.
2047 నాటికి దేశం, రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలపాలి
2047 నాటికి దేశాన్ని, ఆంధ్రప్రదేశ్‌ను అగ్రస్థానంలో నిలపడం లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి తెలిపారు. దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడి పాత్ర కీలకమని, ‘ఇది నా దేశం.. దేశ అభివృద్ధి నా బాధ్యత’ అనే భావనతో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
ప్రతి ఒక్కరూ చేసే పనిలో దేశ భవిష్యత్తు, సమాజ హితం ప్రతిబింబించాలని మంత్రి ఆకాంక్షించారు. ‘వికసిత్ భారత్ 2047’ స్వప్నాన్ని సాకారం చేసేందుకు ప్రజలంతా భాగస్వాములు కావాలని కోరారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ మంత్రి కొల్లు రవీంద్ర హృదయపూర్వక స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

