
శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల కళాశాల మైదానంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, గౌరవ వందనం స్వీకరించారు.
ఈ సందర్భంగా మంత్రి జిల్లా ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశ స్వాతంత్ర్యం కోసం త్యాగాలు చేసిన సమరయోధులను స్మరించుకున్నారు. వారి ఆశయాల స్ఫూర్తితో శ్రీకాకుళం జిల్లాను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందని అచ్చెన్నాయుడు తెలిపారు. జిల్లాలో ఎన్టీఆర్ భరోసా, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ–PM కిసాన్ వంటి పథకాల ద్వారా ప్రజలు, రైతులకు ప్రయోజనం అందిస్తున్నామని చెప్పారు.
సాగునీటి రంగంలో నేరడి బ్యారేజీ, మహేంద్రతనయ ఆఫ్‌షోర్ ప్రాజెక్టు పనులను వేగవంతం చేస్తున్నామని తెలిపారు. జిల్లాలో రహదారులు, తాగునీరు, మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు.
మూలపేట గ్రీన్‌ఫీల్డ్ పోర్టు అభివృద్ధితో శ్రీకాకుళం జిల్లాను వాణిజ్య, పారిశ్రామికంగా మరింత అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. ఉపాధి కల్పన, మహిళా సంక్షేమం, పర్యాటకం, పరిశ్రమల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు.
‘స్వర్ణాంధ్ర @ 2047’ లక్ష్యంలో భాగంగా ‘స్వర్ణ శ్రీకాకుళం’ సాధించడమే లక్ష్యంగా ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు సమష్టిగా పనిచేయాలని మంత్రి అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, అసిస్టెంట్ కలెక్టర్ హరి ఓం పాండియా, ఎమ్మెల్యే గొండు శంకర్, అధికారులు, పోలీసు సిబ్బంది, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

