ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2027 సీజన్‌కు ముందే ముంబై ఇండియన్స్ జట్టులో నాయకత్వ మార్పులపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. మాజీ కెప్టెన్ రోహిత్ శర్మకు తిరిగి జట్టు పగ్గాలు అప్పగించనున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి ముంబై ఇండియన్స్ యాజమాన్యం త్వరలోనే కీలక ప్రకటన చేసే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది.

వైస్ కెప్టెన్సీ రేసులో తిలక్ వర్మ

తెలుగు యువ క్రికెటర్ తిలక్ వర్మకు ముంబై ఇండియన్స్ వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం. భవిష్యత్తు నాయకుడిగా అతడిని తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో మేనేజ్‌మెంట్ ఈ దిశగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. రోహిత్ శర్మ మరో మూడేళ్ల నుంచి నాలుగేళ్ల వరకు జట్టులో కొనసాగితే.. ఈలోగా తిలక్‌కు నాయకత్వ అనుభవం కల్పించి, భవిష్యత్తులో కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాలనేది ఫ్రాంచైజీ ఆలోచనగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలపై ఇప్పటివరకు అధికారిక స్పష్టత లేదు.

కెప్టెన్సీ పోటీలో సూర్య, బుమ్రా లేనట్టే!

ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ రేసులో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా పేర్లు ప్రస్తుతం ప్రధానంగా వినిపించడం లేదు. సూర్య ఆటగాడిగా జట్టులో కొనసాగనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు బుమ్రాపై అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు ఐపీఎల్‌లోనూ బౌలింగ్ భారం ఎక్కువగా ఉండటంతో అతడికి అదనపు బాధ్యతలు ఇవ్వకూడదనే ఆలోచనలో మేనేజ్‌మెంట్ ఉన్నట్లు సమాచారం.

రోహిత్ నాయకత్వంలో ఐదు టైటిళ్లు

ముంబై ఇండియన్స్‌కు రోహిత్ శర్మ అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా గుర్తింపు పొందాడు. అతడి నాయకత్వంలో జట్టు 2013, 2015, 2017, 2019, 2020 సంవత్సరాల్లో ఐదు ఐపీఎల్ ట్రోఫీలను సొంతం చేసుకుంది. అందుకే రోహిత్ మళ్లీ కెప్టెన్‌గా బాధ్యతలు చేపడతాడనే ప్రచారం అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. అయితే కెప్టెన్, వైస్ కెప్టెన్ ఎంపికపై ఫ్రాంచైజీ అధికారిక ప్రకటన వెలువడితేనే ఈ ఊహాగానాలకు తెరపడనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *